
- మరో 10 మందికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ ఏర్పాట్లు
- ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ రెండో విడత దర్యాప్తు ప్రారంభించింది. లండన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ, ఆర్గనైజర్ గ్రీన్ కో ఏస్ నెక్ట్స్ జెన్ అందించిన పూర్తి డాక్యు మెంట్లను పరిశీలించిన అనంతరం మరోసారి విచారణకు రంగం సిద్ధం చేసింది. దర్యాప్తులో భాగంగా మరో పది మందికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని నిర్ణ యించింది. ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, 9న కేటీఆర్, 10న హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని, 18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి దుర్వినియోగమైన రూ.55 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టింది.
నలుగురు నిందితులు సహా మరో 24 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో) సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరి 28న వర్చువల్‌గా ప్రశ్నించారు. సీజన్1 ఆర్గనైజర్ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ నుంచి అగ్రిమెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లను సేకరించారు. దర్యాపులో భాగంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించారు. వీటి ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు.