ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..

ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..

హైదరాబాద్: ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 6న ఉదయం పది గంటలకు కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఏసీబీ స్పష్టం చేసింది. కేటీఆర్ విచారణ ముగిశాక ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అధికారులను కూడా ఏసీబీ విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే.. కేటీఆర్తో పాటు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్కు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్కు ఇప్పటికే ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫార్ములా–-ఈ రేస్‌‌ కేసులో జనవరి 7న తమ ముందు విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. అదే విధంగా ఇదే కేసులో హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని జనవరి 2న, సీనియర్ ఐఏఎస్‌‌ ఆఫీసర్ అర్వింద్‌‌కుమార్‌‌ను జనవరి 3న విచారణకు రావాలని సమన్లు పంపింది. ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది.

ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన ఇద్దరు అధికారులు తాము రాలేమంటే రాలేమని ఇప్పటికే ఈడీ లేఖలు రాశారు. తమకు సమయం కావాలని పేర్కొంటూ ఈడీకి మెయిల్ పంపడం చర్చనీయాంశమైంది. జనవరి 2న విచారణకు వెళ్లాల్సిన హెచ్ఎండీఏ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తాను రాలేనని, సమయం కావాలని లేఖ రాశారు. జనవరి 3న విచారణకు వెళ్లాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా జనవరి 2న మధ్యాహ్నం ఈడీకి లేఖ పంపారు. తాను విచారణకు రాలేనని సమయం ఇవ్వాలని కోరారు. వీరిద్దరి లేఖలకు ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా –ఈ రేస్‌‌ కోసం హెచ్ఎండీఏ నిధులను విదేశాలకు తరలించడంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. మనీలాండరింగ్​వ్యవహారం కావడంతో ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ఫారిన్ ఎక్స్‌‌ఛేంజ్‌‌మేనేజ్‌‌మెంట్‌‌యాక్ట్‌‌, మనీలాండరింగ్‌‌ యాక్ట్​ (పీఎమ్‌‌ఎల్‌‌ఏ) కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌, అర్వింద్‌‌‌‌కుమార్‌‌, బీఎల్‌‌‌ఎన్‌‌‌‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి బ్రిటన్‌‌‌‌లోని అకౌంట్స్​కు ఎలాంటి ట్యాక్స్‌‌‌‌లు చెల్లించకుండానే రూ.45.71 కోట్లు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసినట్లు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లో వెలుగు చూసింది. దీంతో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు గాను హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచే రూ. 8 కోట్ల  6లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు  ఇన్‌‌‌‌స్క్రిప్షన్ - ఇంటర్‌‌‌‌స్టేట్ చాంపియన్​షిప్​ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో రూ. 1,10,51,014 హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది. ఇట్ల మొత్తంగా రూ. 54,88,87,043 హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగాయి. హెచ్‌‌‌‌ఎండీఏ నిబంధనల ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే ప్రభుత్వం,ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇదంతా జరిగింది.