
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) దశరథ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క్వాలిటీ క్లియరెన్స్ రిపోర్టు ఇచ్చేందుకు రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జీహెచ్‌ఎంసీ డివిజన్2లో ఓ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించాడు. బిల్లుల చెల్లింపు కోసం బంజారాహిల్స్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ దశరథ్ వద్దకు ఫైల్ వెళ్లింది.
ఇందుకోసం దశరథ్.. ఆ కాంట్రాక్టర్ ను రూ.30 వేల లంచం అడిగాడు. మొదటి విడతగా కాంట్రాక్టర్ వద్ద రూ.10 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే సమయంలో మిగతా డబ్బు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం రూ.20 వేలు అందించగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.