ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు
  • లంచం తీసుకుంటూ డీఈఈతో పాటు మున్సిపల్​ ఆర్ఐ, 
  • సీనియర్​ అసిస్టెంట్​ పట్టివేత

ఆదిలాబాద్/మెదక్ టౌన్/ఖమ్మం టౌన్, వెలుగు: లంచం తీసుకుంటూ మంగళవారం ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి..ఆదిలాబాద్  ఎడ్యుకేషన్  వెల్ఫేర్  ఇన్​ఫ్రాస్ట్రక్చర్  డెవలప్​మెంట్ కార్పొరేషన్  డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్  ఇంజనీర్  జిన్నంవార్  శంకర్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్  స్కూల్(బాలికల) బిల్డింగ్​కు సంబంధించిన  రూ.2 కోట్ల బిల్లు చెల్లించేందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని కాంట్రాక్టర్​ను డిమాండ్  చేశాడు.

ఆ తరువాత రూ.లక్షకు ఒప్పుకున్నాడు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారి సూచనల మేరకు మైనార్టీ స్కూల్​లో నగదు అందజేశాడు. అక్కడే వేచి ఉన్న ఏసీబీ అధికారులు డీఈఈని అరెస్ట్​ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. 

మెదక్​లో..

మెదక్​ పట్టణానికి చెందిన గెల్లి శైలజకు స్థలాన్ని మ్యుటేషన్ చేయించేందుకు ఆమె సోదరుడు శ్రీనివాస్​ మున్సిపల్​ ఆఫీస్​లో దరఖాస్తు చేశాడు. మున్సిపల్​ ఆర్ఐ ​జానయ్య రూ.20 వేలు డిమాండ్​ చేయగా, రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం మున్సిపల్​ ఆఫీస్​లో రూ.12 వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్​ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్​ హ్యాండెండ్​గా పట్టుకున్నారు. 

ఖమ్మం ఎక్సైజ్​ ఆఫీస్​లో..

ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్  ఆఫీస్​ సీనియర్  అసిస్టెంట్  భూక్య సోమ్లానాయక్  రూ.15 వందలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నగరంలోని మూత పడిన బార్ ఓనర్​కు కోర్టుకు సమర్పించాల్సిన లైసెన్స్  జిరాక్స్  కోసం సీనియర్​ అసిస్టెంట్​ సోమ్లా నాయక్  రూ.2 వేలు డిమాండ్  చేశాడు. 15 రోజులుగా లైసెన్స్  కాపీ కోసం తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమ్లానాయక్​కు రూ.15 వందలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.