తమ సంచలన ప్రదర్శనతో ఇప్పటికే పసికూన అనే ట్యాగ్ లైన్‌ను తొలగించుకున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీ20 క్రికెట్‌లో అత్యంత అనుభవం ఉన్న బౌలర్‌ను తమ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది.
మరో 10 రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలివైన నిర్ణయం తీసుకుంది. కరేబియన్ ఆటగాడు, రెండుసార్లు పురుషుల టీ20 ప్రపంచకప్ విజేత డ్వేన్ బ్రావోను తమ జాతీయ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన బ్రావో.. ప్రస్తుతం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో 10 రోజుల శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఈ విండీస్ పేసర్‌కు అన్ని రకాల పిచ్‌లపై ఆడి ఉండటంతో.. అతని సేవలు ఆఫ్ఘన్ జట్టుకు వరంగా మారనున్నాయి.
Meet our new Fast Bowling Consultant, the Champion, @DJBravo47! 🤩🚨
— Afghanistan Cricket Board (@ACBofficials) May 21, 2024
Read more 👉: https://t.co/cYjC1WsFxZ
రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలరైన బ్రేవో.. టీ20 క్రికెట్‌లో 625 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రెకార్డులకెక్కాడు. బ్యాటింగ్‌లో దాదాపు 7000 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే అతన్ని టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్-రౌండర్లలో ఒకడిగా నిలిపాయి. ఇక మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రేవో.. 6423 పరుగులు, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో ఇటీవల ఐపీఎల్ పదిహేడో సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ కప్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ ఎఫ్హఖ్, నౌర్ అహ్మద్, , ఫరీద్ అహ్మద్ మాలిక్.
రిజర్వ్ ప్లేయర్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ.