- దానకిశోర్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఏసీబీ
- ప్రైవేట్ ప్లేస్ లో 7 గంటల పాటు విచారణ
- కీలక డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు
- త్వరలో కేటీఆర్, అర్వింద్ కూ నోటీసులు!
హైదరాబాద్: ఫార్ములా–ఈ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇవాళో, రేపో మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు, అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం. ఫార్ములా ఈ కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వాంగ్మూలాన్ని నిన్నే ఏసీబీ రికార్డు చేసింది. ఆయన నుంచి కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సుమారు ఏడు గంటలపాటు దాన కిషోర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇచ్చిన డాక్యమెంట్ల ఆధారంగా కేటీఆర్, అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది.
ALSO READ | ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారని దానకిశోర్ పేర్కొన్నారు. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ నుఏ2గా, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి ఏ3గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది.