- మాటలను రికార్డ్ చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ ఆఫీసర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ రమేశ్వెల్లడించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన భుక్యా లక్ష్మా కరెంట్ మీటర్ కోసం నో డ్యూస్ సర్టిఫికెట్ కావాలని పంచాయతీ సెక్రెటరీ కంపాటి పుల్లయ్యను కలిశాడు. నో డ్యూస్ సర్టిఫికెట్ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ డిమాండ్ చేశాడు.
దీంతో లక్ష్మా ఏసీబీని సంప్రదించాడు. వారి సూచన మేరకు రూ.20 వేలు కాదు రూ. 18 వేలు ఇస్తానంటూ లక్ష్మా సెక్రెటరీతో బతిమిలాడిన మాటలను ఏసీబీ ఆఫీసర్లు రికార్డు చేశారు. పంచాయతీ ఆఫీస్లో సెక్రటరీని ఏసీబీ డీఎస్పీ రమేశ్ అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. లంచం తీసుకోవడమే కాదు, డిమాండ్ చేయడం కూడా నేరమేనని డీఎస్పీ పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీ పుల్లయ్యపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి.