
రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ ఏఈ. అదే ఆఫీసులో పనిచేస్తున్న డీఈ.. ఇది ముందే గమనించి ఏసీబీ ముందే పరారయ్యాడు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరులో చోటు చేసుకుంది ఈ ఘటన. శుక్రవారం ( ఏప్రిల్ 4 ) పటాన్ చేరులోని ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు.
ఈ దాడుల్లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిశోర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.గుమ్మడిదల మండలంలో నాలా ఎన్ఓసి క్లియరెన్స్ కోసం ఏఈ రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.
ఈ క్రమంలో రూ. 7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న ఏఈ.. మార్చి 28వ తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తుండడంతో ఏసీబీ ని ఆశ్రయించాడు బాధితుడు. ముందే అనుకున్న ప్రకారంగా మొదటి విడతగా లక్ష రూపాయలు శుక్రవారం ( ఏప్రిల్ 4 ) ఏఈ కార్లోని డాష్ బోర్డులో పైసలు పెడుతుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఇది గమనించిన డీఈ రామస్వామి ఏసీబీ ముందే పరారయ్యాడు. దీంతో అవాక్కవ్వడం ఏసీబీ అధికారుల వంతు అయ్యింది. ఏఈని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని దగ్గర నుండి రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో ఏఈ తో పాటు ఇంకా పై అధికారులు ఏమైనా ఉన్నారా..తను ఒక్కడే డిమాండ్ చేశాడా అన్నది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు ఏసీబీ అధికారులు.