కొత్త కరెంట్ మీటర్ ఇప్పించేందుకు లంచం.. ACBకి అడ్డంగా దొరికిపోయిన లైన్ ఇన్‌స్పెక్టర్

కొత్త కరెంట్ మీటర్ ఇప్పించేందుకు లంచం.. ACBకి అడ్డంగా దొరికిపోయిన లైన్ ఇన్‌స్పెక్టర్

పాల్వంచ, వెలుగు : అక్రమ కనెక్షన్‌‌‌‌పై కేసు నమోదు కాకుండా చూసేందుకు, కొత్త మీటర్‌‌‌‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ట్రాన్స్‌‌‌‌కో ఉద్యోగిని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కరకవాగుకు చెందిన గుగులోతు నాగరాజు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు. టౌన్‌‌‌‌ 1 విభాగంలో లైన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌గా పనిచేస్తున్న జినుగు నాగరాజు ఇటీవల గుగులోతు నాగరాజు వద్దకు వెళ్లి విద్యుత్‌‌‌‌ కనెక్షన్‌‌‌‌ అక్రమంగా వాడుతున్నావని, దీనిపై కేసు నమోదు చేయిస్తానని బెదిరించాడు. 

కొత్తగా కరెంట్‌‌‌‌ మీటర్‌‌‌‌ ఇప్పించాలన్నా, కేసు నమోదు కాకుండా చూసుకోవాలన్నా రూ. 80 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని గుగులోతు నాగరాజు చెప్పడంతో చివరకు రూ. 26 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత ఇంటి యజమాని గుగులోతు నాగరాజు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో బుధవారం పాల్వంచలోని రిలయన్స్‌‌‌‌ మార్ట్‌‌‌‌ వద్ద ఉన్న లైన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ నాగరాజుకు డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అతడిని రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్‌‌‌‌ చెప్పారు.