పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు గంగాధర మండల అసిస్టెంట్ సబ్ రిజస్ట్రార్ సురేశ్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకంపేట గ్రామానికి చెందిన కొక్కుల అజయ్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 131 లో 486.42 చదరపు గజాల భూమిని తన తండ్రి అయిన కొక్కుల రాజేశం నుండి గిఫ్ట్ డీడ్ చేయించుకోవడానికి రెండు రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చాడు. గంగాధర కు చెందిన తన మిత్రుడు ఆకుల అంజయ్య ద్వారా ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ శివారం సురేష్ బాబును సంప్రదించారు.
గిఫ్ట్ డీడ్ చేయడానికి ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పదివేల రూపాయలు డిమాండ్ చేయగా ఆకుల అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా శనివారం సబ్ రిజిస్టర్ సూచనల మేరకు పదివేల రూపాయలను కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేస్తున్న కొత్త కొండ శ్రీధర్ కు ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంచార్జి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు, ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు.