
- నాగర్ కర్నూల్లో మేనల్లుడు భరత్ పేరుతో ల్యాండ్స్
- ఫ్రెండ్ సత్యనారాయణ మూర్తి పేరుతో బాచుపల్లిలో ఫ్లాట్స్
హైదరాబాద్, వెలుగు:హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీ నెట్‌వర్క్‌ను ఏసీబీ అధికారులు బ్రేక్ చేస్తున్నారు. బినామీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. శివబాలకృష్ణ మేనల్లుడు భరత్‌కుమార్, బాచుపల్లికి చెందిన స్నేహితుడు జి.సత్యనారాయణ మూర్తిని మంగళవారం ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌లో విచారించారు.
వీరి పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. బుధవారం ఉదయం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 24న18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో ఉన్న వ్యవసాయ భూములు, ఫ్లాట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
నాగర్‌కర్నూల్‌లో భూములు
శివబాలకృష్ణ తన మేనల్లుడు భరత్‌కుమార్ పేరు తో నాగర్‌కర్నూల్‌లో భూమి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి భరత్ కుమార్‌కు రూ.10 లక్షలు ఇచ్చాడు. దీంతో పాటు చల్లా కుమార్ అనే వ్యక్తి నుంచి మరో రూ.10 లక్షలు వసూలు చేసి భరత్‌కుమార్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కల్వకుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌కుమార్, పద్మావతితో కలిసి భరత్‌కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. భరత్‌కుమార్‌తో పాటు బాచుపల్లి శిల్ప ఆర్వి ధరిస్తా అపార్ట్‌మెంట్‌కు చెందిన స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని విచారించారు.
శివబాలకృష్ణ బినామీలు...!
మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో పెంట రమాదేవి పేరుతో ఫ్లాట్, రాయదుర్గం మై హోం భూజాలో డింగరి కిరణ్ ఆచార్య, మాదాపూర్ సాహితి సుముఖి ఆర్బిట్అపార్ట్మెంట్, హబ్సిగూడ వీవీనగర్‌లో కొమ్మిడి సందీప్‌కుమార్ రెడ్డి పేరుతో, బాచుపల్లి శిల్ప ఆర్వీ ధరిస్తా అపార్ట్మెంట్లో జి సత్యనారాయణ మూర్తి, హనుమకొండ భవానీనగర్‌లో సింగరాజు ప్రమోద్‌కుమార్ పేర్లతో ఉన్న ఫ్లాట్స్‌లో సోదాలు నిర్వహించారు.
ఈ ఫ్లాట్స్‌లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు.ఈ ఫ్లాట్స్ అన్ని శివబాలకృష్ణకు చెందినవిగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎమ్మెల్యే కాలనీలో సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తపేట్ ఆర్కే పురంలోని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్లో శివబాలకృష్ణ బినామీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. సోదాల్లో శివబాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నది.