- కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్
- రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్ ఈఈ, ఏటీవో, సీనియర్ అసిస్టెంట్
రేగొండ, వెలుగు : రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందుకు లంచం తీసుకున్న భూపాలపల్లి పంచాయతీ రాజ్ సిబ్బందిని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ సదానందం గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు చేశాడు. ఈ పనులకు సంబంధించి రూ. 4 లక్షల బిల్లు రావాల్సి ఉంది. దీంతో బిల్లు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు.
బిల్లు రిలీజ్ చేయాలంటే రూ. 20 వేలు ఇవ్వాలని ఆఫీసర్లు డిమాండ్ చేశారు. దీంతో సదానందం ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ఆఫీసర్లు ఇచ్చిన సూచన మేరకు గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌లో ఈఈ దిలీప్‌కుమార్, ఏటీవో చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణికి డబ్బులు ఇచ్చాడు. ఇందులో ఈఈ రూ. 10 వేలు, ఏటీవో, సీనియర్ అసిస్టెంట్ రూ. 5 వేల చొప్పున తీసుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ముగ్గురిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.