ఏసీబీకి చిక్కిన స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ డీఈ

ఏసీబీకి చిక్కిన స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ డీఈ
  • లైన్‌‌‌‌ మార్పిడి కోసం రూ. 20 వేలు డిమాండ్‌‌‌‌
  • డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌ మార్పిడి కోసం రైతు నుంచి లంచం తీసుకున్న స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ డీఈ హుస్సేన్‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు శనివారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌కు చెందిన రైతు కుంభం ఎల్లయ్యకు స్థానిక మోడల్​కాలనీ సమీపంలో 1.-25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి మధ్యలో నుంచి 33/11 కేవీ విద్యుత్‌‌‌‌లైన్‌‌‌‌ వెళ్తుండడంతో దానిని పక్కకు మార్చాలని విద్యుత్‌‌‌‌ ఆఫీసర్లను సంప్రదించాడు. ఆఫీసర్లు ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో పరిశీలించి లైన్‌‌‌‌ ఫిష్టింగ్‌‌‌‌కు రూ. 15.94 లక్షల డీడీ చెల్లించాలని చెప్పారు.

దీంతో ఎల్లయ్య మూడు నెలల కింద డీడీ తీసీ ఆఫీసర్లకు అందజేశారు. తర్వాత విద్యుత్‌‌‌‌ ఆఫీసర్లు లైన్‌‌‌‌ ఫిష్టింగ్‌‌‌‌ పనులను ప్రైవేట్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్‌‌‌‌ లైన్‌‌‌‌ మార్పిడి పనులు చేపట్టకపోవడంతో రైతు ఎల్లయ్య, అతడి కుమారుడు రాజు ఇటీవల విద్యుత్‌‌‌‌ డీఈ హుస్సేన్‌‌‌‌ను కలిశారు. రూ. 20 వేలు ఇస్తేనే పనులు జరిపిస్తామని డీఈ స్పష్టం చేశారు. దీంతో ఎల్లయ్య కుమారుడు రాజు మూడు రోజుల కింద వరంగల్‌‌‌‌లో ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు.

ఏసీబీ డీఎస్పీ సూచనతో రాజు శనివారం సాయంత్రం స్థానిక డీఈ ఆఫీస్‌‌‌‌లో హుస్సేన్‌‌‌‌కు రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు డీఈని రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. డీఈని అరెస్ట్‌‌‌‌ చేసి వరంగల్‌‌‌‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. హనుమకొండలోని విద్యుత్‌‌‌‌ డీఈ ఇంట్లో సైతం మరో టీం సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.