
- తహసీల్దార్ రజనీపై గతంలోనూ ఆరోపణలు
- మెండుగా బీఆర్ఎస్ లీడర్ల సపోర్ట్
- సాదాబైనామా క్రమబద్ధీకరణ సమయంలో వీఆర్వో సూసైడ్
హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో పని చేసిన ఎమ్మార్వో రజనీరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె పని చేస్తున్న జమ్మికుంట తహసీల్దార్ ఆఫీస్ తో పాటు గతంలో ఇక్కడ వర్క్ చేసిన కార్యాలయాల్లోనూ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా తనిఖీల అనంతరం వివిధ ల్యాండ్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న రజనీరెడ్డిపై ఉమ్మడి జిల్లాలో గతంలోనూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉండటం వల్లే ఎమ్మార్వో రజనిపై యాక్షన్ తీసుకోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఏ పని కావాలన్నా డబ్బులే...
ధర్మసాగర్ తహసీల్దార్ గా పని చేసిన సమయంలో రజనీరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వరంగల్ శివారులోని రింగ్ రోడ్డు ఈ మండల పరిధిలోనే ఎక్కువగా ఉండగా.. ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్లు కావాలన్నా, నాలా కన్వర్షన్లు చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వచ్చేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు చేయించే క్రమంలో నేరుగా తన పేరు బయటపడకుండా ఆఫీస్ లో పని చేసే సిబ్బంది సహాయంతో డబ్బులు వసూళ్లకు పాల్పడేదని తెలిసింది. డబ్బులు ముట్టేంత వరకు రిజిస్ట్రేషన్ చేయకపోగా.. చేతిలో నగదు లేకుంటే అక్కడున్న సిబ్బంది ఫోన్ పే ద్వారా కూడా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
ఆఫీస్ లో ఏ పని కావాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందేనని, లేదంటే సాకులు చెబుతూ ఇబ్బందులకు గురి చేసేవారనే కొంతమంది ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ధర్మసాగర్ మండలంలోని కొన్ని ప్రభుత్వ భూములు, లిటిగేషన్ ల్యాండ్స్ కు కూడా బై నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. కొన్ని ల్యాండ్స్ కు పదంకెల వరకు బై నెంబర్స్ ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేగాకుండా రింగ్ రోడ్డు సమీపంలో తన కుటుంబ సభ్యుల
పేరున కూడా ల్యాండ్స్ కూడబెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
వీఆర్వో సూసైడ్ విషయంలో ఆరోపణలు
తహసీల్దార్ రజని 2015 నుంచి 2017 వరకు శాయంపేట మండలంలో విధులు నిర్వర్తించగా.. ఆమె అక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ అయిన కొద్దిరోజులకే ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకున్నాడు. దామెర మండలంలోని కోగిల్వాయి గ్రామానికి చెందిన గోల్కొండ మహేందర్.. శాయంపేట మండలంలోని మాందారిపేట వీఆర్వోగా పని చేయగా.. సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించేందుకు రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.
ఆ తరువాత కొద్దిరోజులకే తహసీల్దార్ రజనీ అక్కడి నుంచి బదిలీ కాగా సాదాబైనామా దరఖాస్తులు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. దీంతో డబ్బులు ఇచ్చిన రైతుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో కమలాపూర్ మండలంలోని మాదన్నపేట సమీపంలో వీఆర్వో మహేందర్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా తహసీల్దార్ రజనీ సూచన మేరకే డబ్బు వసూలు చేసి, ఆమెకు అప్పగించాడని, ఆ తరువాత డబ్బులు తీసుకున్న అధికారిణి భూములను క్రమబద్ధీకరించకపోవడం, రైతుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడం వల్లే మహేందర్ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బినామీల పేరుతో భూములు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాయంపేట, వేలేరు, ధర్మసాగర్ తదితర చోట్ల తహసీల్దార్ రజనీ పని చేయగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ధర్మసాగర్ మండల కేంద్రంలో1,104 సర్వే నెంబర్లో 18 ఎకరాల 36 గుంటల అసైన్డ్ భూమి ఉండగా.. అందులో ఎకరం భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఓ ప్రజాప్రతినిధి దగ్గరి బంధువు కావడం, జిల్లాకు చెందిన కొందరు అధికారుల సపోర్టు వల్లే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపించాయి. కాగా ఇటీవల ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు జరుపుతుండటంతో ఆయా మండలాల్లోని సిబ్బంది, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కూడా కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఏసీబీ అధికారులు కూపీ లాగుతుండగా.. విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో చూడాలి.