
- గత 2 నెలల్లో 40 మంది అరెస్టు..రూ.4.13 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే 40 మంది అవినీతి అధికారులను, ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేశారు. 25 ట్రాప్ కేసులు, మూడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, మూడు క్రిమినల్ మిస్ కండక్ట్, మూడు రెగ్యులర్ ఎంక్వైరీ కేసులు, మూడు డిస్క్రీట్‌ఎంక్వైరీ కేసులను నమోదు చేశారు.
ఫిబ్రవరిలో నమోదైన కేసుల వివరాలను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత నెలలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేశారు. ట్రాప్ కేసులకు సంబంధించి మొత్తం రూ.7.6 లక్షలు సీజ్ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.4.13 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎనర్జీ, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, రోడ్లు భవనాలు, ఎంఏయూడీకి చెందిన ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఏసీబీకి చిక్కారు.
కాగా.. లంచం డిమాండ్ చేసే అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్1064కు కాల్ చేయవచ్చని ప్రజలకు ఏసీబీ డీజీ సూచించారు. అదేవిధంగా ఏసీబీ ‘ఎక్స్’ twitter@telanganaACB లేదా ఫేస్‌బుక్@telanganaacb లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.