వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‎కు మరోసారి నోటీసులు

వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‎కు మరోసారి నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో 2025, జనవరి 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ సోమవారమే (జనవరి 6) ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చిన కేటీఆర్.. తనతో తన లాయర్లను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. దీంతో మరోసారి ఏసీబీ కేటీఆర్‎కు నోటీసులు జారీ చేసింది. మరీ నెక్ట్స్ టైమ్ అయిన కేటీఆర్ విచారణకు హాజరవుతారో లేదా చూడాలి. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‎లో  ఫార్ములా ఈ కారు రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.  బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ ఏ2, బీఎల్ ఎన్ రెడ్డిని ఏ3 నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 

ALSO READ | ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో ఫార్ములా! ..గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ రూ. 41 కోట్లు

ఈ క్రమంలోనే సోమవారం (జనవరి 6) విచారణకు రావాలని ఏసీబీ కేటీఆర్‎కు నోటీసులు జారీ చేసింది. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి సమన్లు పంపింది. మరోవైపు ఈ కేసును కేటీఆర్ హై కోర్టులో సవాల్ చేశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‎ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.  జడ్జిమెంట్ వచ్చే వరకు కేటీఆర్‎ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసుకోవచ్చని తెలిపింది.