ఫార్ములా రేస్‌తో రూ. 700 కోట్ల లాభాలొస్తే.. ఎటుపోయినయ్​?

  • టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్,యాడ్స్​ ఆదాయం ఏమైంది?
  • కేటీఆర్​ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు 
  • సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​!
  • ఏడు గంటలపాటు కొనసాగిన ఎంక్వైరీ
  • రేస్​తో రూ.700 కోట్ల లాభాలొచ్చినయన్న కేటీఆర్​
  • ఇదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ
  • లాభాలు ప్రభుత్వానికి వచ్చినయా? ప్రైవేట్ ​సంస్థలకు వచ్చినయా?
  • ఆ డబ్బులు ఏ డిపార్ట్​మెంట్​ అకౌంట్స్​లో జమైనయ్​?
  • సీజన్‌ 10 నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్‌ జెన్‌పై చర్యలెందుకు తీసుకోలే! 
  • రూల్స్​ పాటించకుండా బ్రిటన్​ కంపెనీకి పైసలెందుకు పంపారని ప్రశ్నల వర్షం
  • దానకిశోర్‌‌, అర్వింద్‌కుమార్‌‌ స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా విచారణ

హైదరాబాద్‌, వెలుగు : ఫార్ములా–-ఈ రేస్‌ కేసులో అక్రమ చెల్లింపులపై గురువారం బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ను ఏసీబీ ప్రశ్నించింది. ‘‘ఫార్ములా –ఈ రేస్‌ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలిగింది? ’’ అని ఏసీబీ ప్రశ్నించగా..  హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​ పెంచడం ద్వారా రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్​ చెప్పారు. దీంతో రూ. 700 కోట్ల లాభాలు ఎటుపోయాయంటూ పలు కోణాల్లో ఏసీబీ ఆరా తీసింది. ‘‘అన్ని కోట్ల లాభాలొస్తే ఆ డబ్బులు ఎక్కడ? టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్‌ వల్ల వచ్చిన ఆదాయమంతా ఏమైంది?”

అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయిన కేటీఆర్.. సంబంధంలేని అంశాలు మాట్లాడారని, కొన్ని ప్రశ్నలకైతే ఎదురు ప్రశ్నలు వేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఫార్ములా –ఈ రేస్​ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్​ను  గురువారం ఉదయం 10 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

విదేశీ సంస్థలతో ఫార్ములా– ఈ రేస్​ ఒప్పందాలు, చెల్లింపుల్లో ఉల్లంఘనలు, రేస్‌‌ వల్ల హెచ్‌‌ఎండీఏ సహా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభాలు ఎటు వెళ్లాయి? అనే కోణంలో  ఆయనను విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు జూబ్లీహిల్స్‌‌ నందినగర్‌‌‌‌లోని తన ఇంటి నుంచి ఉదయం 9.50 గంటలకే న్యాయవాది, మాజీ అడ్వకేట్‌‌ జనరల్‌‌ రామచంద్రరావుతో  కలిసి కేటీఆర్​ బయలు దేరారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌కు చేరుకున్నారు. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉ‍న్న అంశాలకు సంబంధించి సమాధానాలు ఇచ్చేందుకు అవసరమైన కొన్ని పత్రాలను ఆయన తన వెంట తెచ్చుకున్నారు.

అడ్వకేట్‌‌కు కనిపించేలా ఎంక్వైరీ

ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌‌‌‌ రితిరాజ్‌‌, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌ మాజిద్‌‌ అలీ ఖాన్, డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌ శివరామ్‌‌ శర్మ సహా మొత్తం ఐదుగురు సభ్యుల బృందం  కేటీఆర్‌‌‌‌ స్టేట్‌‌మెంట్​ను రికార్డ్‌‌ చేసింది. కోర్టు సూచన ప్రకారం.. న్యాయవాదికి కేటీఆర్‌‌ కనిపించేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రూమ్‌‌లో సీసీటీవీ కెమెరాలు ఆపరేట్‌‌ చేశారు. లంచ్‌‌ టైమ్‌‌లో కేటీఆర్​కు పప్పు అన్నం పెట్టారు. విచారణ గదికి కొద్ది దూరంలో అడ్వకేట్‌‌ రామచంద్రరావు కూర్చున్నారు. కేటీఆర్‌‌‌‌ను ఏసీబీ అధికారులు విచారించే విధానాన్ని రామచంద్రరావు గమనించారు.

ఏసీబీ అధికారులు ఏ అంశాలపై కేటీఆర్‌‌ను ప్రశ్నిస్తున్నారన్నది వినేందుకు గానీ, విచారణ మధ్య కేటీఆర్‌‌తో న్యాయవాది మాట్లాడడానికి గానీ అధికారులు అవకాశం ఇవ్వలేదు.  ప్రధానంగా ఫార్ములా– ఈ రేస్‌‌ నిర్వహించడానికి గల కారణాలు.. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరిగిందన్న అంశాలను కేటీఆర్‌‌ నుంచి వివరాలు రాబట్టారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా  ఆయన పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ), హైదరాబాద్‌‌ మెట్రో డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ(హెచ్‌‌ఎండీఏ) పనితీరు వంటి  అంశాలనూ ఆరా తీశారు.  

ఫార్ములా –ఈ కార్‌‌‌‌ రేసింగ్ నిర్వహించాలనే ప్రతిపాదనలు ఎవరు తీసుకువచ్చారు? దీనికి బీజం ఎలా పడిందన్న వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు.  బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌‌ (ఎఫ్‌‌ఈఓ)కు నిబంధనలు అతిక్రమించి మరీ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందన్న అంశంపై కూడా ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది.

పెట్టిన ఖర్చెంత? వచ్చిన లాభమెంత? అవి ఎక్కడ? 

కేసులో ఫిర్యాదుదారుడైన ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దానకిశోర్‌‌‌‌, నిందితుడైన స్పెషల్ చీఫ్‌‌ సెక్రటరీ అర్వింద్‌‌కుమార్‌‌‌‌ ఇచ్చిన స్టేట్‌‌మెంట్స్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. వీరిద్దరి స్టేట్‌‌మెంట్స్‌‌లో పేర్కొన్న చాలా అంశాలకు కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. ‘‘అన్ని రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా?’’ అని తెలివిగా సమాధానాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ‘‘హైదరాబాద్‌‌ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ను పెంచేందుకే ఫార్ములా –ఈ కార్ రేస్‌‌ నిర్వహించాం.. దీని ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్లు లాభాలు వచ్చాయి.. ’’  

అని కేటీఆర్​ చెప్పడంతో దాని ఆధారంగా  ఏసీబీ అధికారులు ఆయనపై మరిన్ని ప్రశ్నలు కురిపించినట్లు తెలిసింది. ‘‘ఫార్ములా– ఈ రేస్‌‌  నిర్వహణ వల్ల లాభాలు వచ్చాయని  మీరు చెప్తున్నారు. ప్రభుత్వానికి వచ్చాయా? ప్రైవేట్​వ్యాపార సంస్థలకు వచ్చాయా? వాటికి లెక్కలేమిటి?’’ అని అడిగినట్లు సమాచారం.  అదీగాక ‘‘సీజన్‌‌ 9 ఈవెంట్‌‌ టైంలో ఏర్పాటు చేసిన  హోర్డింగ్స్, అడ్వర్టయిజ్​మెంట్స్​తో  ప్రభుత్వానికి గానీ, హెచ్‌‌ఎండీకు గానీ ఎంత మొత్తంలో లాభాలు వచ్చాయి?

ఈవెంట్స్ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు? ఆ మొత్తం ఎటుపోయింది? ఆ డబ్బు ఏ డిపార్ట్‌‌మెంట్‌‌ అకౌంట్స్‌‌లో డిపాజిట్ చేశారు?’’ అని కేటీఆర్​ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రశ్నల్లో చాలా వాటికి కేటీఆర్​సమాధానం దాటవేసినట్లు సమాచారం.  .

ఏస్ నెక్స్ట్‌‌ జెన్‌‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

‘‘ఫార్ములా– ఈ కార్‌‌‌‌ రేసింగ్‌‌కు బీజం ఎలా పడింది..? దానికి ఎవరు ప్రపోజ్​ చేశారు? ఒప్పందాల్లో పేర్కొన్నట్టు కాకుండా.. నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?  సీజన్‌‌ 9 నిర్వహణ కోసం చేసుకున్న అగ్రిమెంట్‌‌ గురించి మీకు తెలుసా? ఎంఏయూడీ, ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌‌, ఏస్ నెక్స్ట్‌‌ జెన్‌‌ త్రైపాక్షిక ఒప్పందం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఇందుకు సంబంధించిన బోర్డ్‌‌ మీటింగ్స్‌‌ జరిగాయా?’’ అని కేటీఆర్ ను​ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​ను పెంచడం కోసమే తాము రేసింగ్​ నిర్వహించాం తప్ప ఇందులో తమ సొంత ప్రయోజనాలేమీ లేవని కేటీఆర్​సమాధానమిచ్చినట్లు సమాచారం.

‘‘2024 ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన సీజన్‌‌10 నుంచి స్పాన్సర్ సంస్థ ఏస్‌‌ నెక్స్ట్‌‌ జెన్ ఎందుకు తప్పుకుంది? ఏస్ నెక్స్ట్‌‌ జెన్ తప్పుకుంటే వారి వివరణ ఎందుకు తీసుకోలేదు..? హెచ్‌‌ఎండీఏకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ఏస్‌‌ నెక్స్ట్‌‌ జెన్‌‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?’’ అంటూ ఏసీబీ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్​ సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. 

ఇదో చెత్త కేసు : మీడియాతో కేటీఆర్‌‌ 

సాయంత్రం 5 గంటలకు విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్‌‌‌‌ అక్కడ మీడియాతో మాట్లాడారు. తనను ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని విమర్శించారు. ‘‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు. ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్‌‌ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు.

నాపై కేసు పెట్టి రేవంత్‌‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే. పైసలు పంపాను అని నేనే చెప్తున్న. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్‌‌ఈవో) చెప్తున్నరు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే.. అధికారుల దగ్గర సమాధానమే లేదు. రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియడం లేదు. పూర్తిగా అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పాను. ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చాను. ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పాను’’ అని ఆయన పేర్కొన్నారు. 

ఏం నొచ్చింది నీకు?

విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్​.. పోలీసులపై చిర్రుబుర్రులాడారు. వస్తూ వస్తూనే అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. ట్రాఫిక్​ సమస్య అవుతుందని, ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్​ జోన్​ డీసీపీ విజయ్​కుమార్​ సూచించగా.. ‘‘ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు?” అంటూ అసహనం ప్రదర్శించారు.  ‘‘ఏమైందయ్యా? మీడియా మీద దాడెందుకు? ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది.. ఏం ఇబ్బందైంది నీకు? మీడియాతో మాట్లాడితే భయమేంటికి?” అంటూ ప్రశ్నించారు.