విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..
ఏసీబీ: ఫార్ములా ఈ రేస్ ఫైల్ పైన సంతకం పెట్టిన మీరు ఆ ఫైల్ కేబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు?
కేటీఆర్: రేస్‌ను హైదరాబాద్ లో కొనసాగించడం ద్వారా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే ఫైలు పై సంతకం పెట్టిన. బిజినెస్ రూల్స్ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ఫైల్ మూమెంట్ కి చట్టపరంగా బాధ్యత వహించేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే! అలాంటప్పుడు ఈ కేసులో సీఎస్‌కి మీరు ఎందుకు నోటీసు ఇవ్వలేదు?
ఏసీబీ: మీ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఏమైనా జీవో ఇచ్చిందా?
కేటీఆర్: సెక్రటేరియెట్ బిజినెస్ రూల్స్ అన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని అడిగితే మంచిది.
ఏసీబీ: కేబినెట్‌కు తెలియకుండా మీరు ఇలాంటి విధానపరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆర్బీఐ రూల్స్‌కి విరుద్ధంగా కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు ఎలా చెల్లించారు?
కేటీఆర్: మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన నాకు ముమ్మాటికీ ఉంది. అయితే బిజినెస్ రూల్స్ చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే . అది నా బాధ్యత కాదు.
ఏసీబీ: ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి రూ.54.89 కోట్లు నష్టం జరిగింది? ఈ విషయం మీరు ఒప్పుకుంటారా?
కేటీఆర్: రేసు కొనసాగించకపోవడం వల్లనే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒప్పందం రద్దుచేసి రాష్ట్రానికి నష్టం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కేసులో భాగస్వామిగా ఎందుకు చేర్చలేదు?
ఏసీబీ: ఫార్ములా ఈ రేస్‌లో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి?
కేటీఆర్: ఎక్కడి నుంచి డబ్బులు పోయాయి..? ఎక్కడ డబ్బులు ఉన్నాయి.. ? అన్న విషయంతా ఎఫ్ఐఆర్ లోనే ఉంది. అలాంటప్పుడు డబ్బులకు సంబంధించి దుర్వినియోగం అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది? ఇందులో అవినీతికి అవకాశమెక్కడుంది? ఇది ముమ్మాటికీ అక్రమ కేసు.
ఏసీబీ: ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థతో ఎలాంటి ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయి? ఆ వివరాలుగానీ, అప్పటి డాక్యుమెంట్లు గానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
కేటీఆర్: నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈమెయిల్లోనే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన పూర్తి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఆ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది. ఈ వివరాలు ప్రభుత్వం నుంచి తీసుకోండి.
ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు దాటవేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనిత ప్రశ్నలు అడగడం వల్ల ఈ కేసు విచారణ ముందుకు పోదని, ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ‘this is a meaningless case.. why are you chasing a wild goose.. this case will lead to no where’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.