- లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు ఎన్వోసీలు
- రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నిఖేశ్, ఆయన బంధువుల ఇండ్లల్లో రైడ్స్
- రూ.17.73 కోట్లు విలువైన ఆస్తుల గుర్తింపు..మార్కెట్ వ్యాల్యూ 177.3 కోట్లు
- -నిఖేశ్ ఉద్యోగంలో చేరింది 2013లోనే ఏఈఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
హైదరాబాద్, వెలుగు : ఏసీబీ దాడిలో ఓ ఇరిగేషన్ఏఈఈకి చెందిన భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. ఉద్యోగంలో చేరిన 10 ఏండ్లలోనే రూ.170 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు విస్తుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సస్పెండెడ్) హెరుర్ నిఖేశ్‌కుమార్ ఇండ్లల్లో శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ పెబిల్ సిటీలోని నిఖేశ్‌కుమార్ ఇండ్లతోపాటు 19 ప్రాంతాల్లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల గృహాల్లోనూ సోదాలు జరిపారు. నిఖేశ్‌కుమార్ ఇంట్లో 5 ఓపెన్ ప్లాట్స్, వివిధ అపార్ట్‌మెంట్స్‌లోని 6 ఫ్లాట్స్, 2 కమర్షియల్ కాంప్లెక్స్‌లు,6.5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్స్ ప్రకారం వీటి విలువ రూ.17.73 కోట్లుగా గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.177.3 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అనంతరం ఏఈఈ నిఖేశ్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, నిఖేశ్ కుమార్ గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో మే నెలలో జైలు పాలయ్యారు. ఈ కేసు విచారణలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ వెలికితీసిన ఆస్తుల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వే ఎక్కువ ఉన్నట్టు సమాచారం.
రూ. లక్ష లంచం తీసుకుంటూ..
రంగారెడ్డి జిల్లా మణికొండ నెక్నంపూర్‌కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌వోసీ కోసం ఈ ఏడాది మే లో దరఖాస్తు చేసుకున్నాడు. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా సర్కిల్ ఇరిగేషన్ ఆఫీస్‌లో ఫైల్ పెండింగ్‌లో ఉంది. దీంతో సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆఫీస్‌లో ఉపేంద్రనాథ్ సంప్రదించాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఈఈ కె. భన్సీలాల్, ఏఈ కార్తీక్‌తో పాటు అక్కడే పనిచేస్తున్న ఏఈఈ నిఖేశ్‌కుమార్ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. వీరితోపాటు గండిపేట్ ఎమ్మార్వో ఆఫీస్ సర్వేయర్ పి. గణేశ్ ఉపేంద్రనాథ్ నుంచి రూ.40 వేలు లంచం తీసుకున్నాడు. వీరు మరింత లంచం డిమాండ్ చేయడంతో ఉపేంద్రనాథ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు వారిని ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఏఈ భన్సీలాల్ గ్యాంగ్‌కు రూ. లక్ష ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 30న రూ.లక్ష తీసుకుంటుండగా రైడ్ చేసి, పట్టుకున్నారు. ఏఈ భన్సీలాల్ వద్ద రూ.65 వేలు, నిఖేశ్‌కుమార్ వద్ద రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏఈ భన్సీలాల్‌తో పాటు కె. కార్తీక్, నిఖేశ్‌కుమార్, సర్వేయర్ గణేశ్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇరిగేషన్ ఇంజినీర్లు సహా సర్వేయర్ గణేశ్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేశారు.
రంగారెడ్డి సర్కిల్‌లో చక్రం తిప్పిన నిఖేశ్
నిఖేశ్‌కుమార్ 2013లో ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా ఉద్యోగంలో చేరాడు. రాజేంద్రనగర్ నియోజకవర్గం సహా గ్రేటర్ హైదరాబాద్‌లోని రంగారెడ్డి సర్కిల్ లో ఇరిగేషన్ విధులు నిర్వహించేవాడు. ఈ ఏడాది మే వరకు రెడ్‌హిల్స్‌లోని సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆఫీస్‌లో ఏడబ్ల్యూ సెక్షన్‌లో విధులు నిర్వర్తించాడు. గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న భారీ బిల్డింగ్స్ సహా రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు ఇరిగేషన్ అనుమతులు తప్పనిసరి కావడంతో అవినీతికి స్కెచ్ వేశాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. భన్సీలాల్,అసిస్టెంట్ ఇంజినీర్ కె. కార్తీక్‌తో కలిసి లంచాలు వసూలు చేశాడు. ఇలా అతి తక్కువ సమయంలోనే రూ. 170 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.