లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్

కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను  అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెందిన గుణవంతరావు అనే వ్యక్తి సర్వే పని కోసం తహసీల్దార్ కార్యాలయంలో  దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులైనా పనికాకపోవడంతో విసిగిపోయాడు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న గణపతి సర్వేయర్ లంచం ఇస్తే పని చేసి పెడతానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ మంగళవారం రూ.15వేలు లంచం డబ్బులు సర్వేయర్ గణపతికి ఇచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 

బాధితుడి నుంచి తీసుకున్న లంచం డబ్బు రూ.15 వేలు సీజ్ చేశారు. కార్యాలయంతోపాటు సర్వేయర్ గణపతి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో రోజువారీ వేతన ఒప్పంద ప్రాతిపదికన సర్వేయర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.