హనుమకొండ డీటీవో ఇంట్లో ఏసీబీ సోదాలు

హనుమకొండ డీటీవో ఇంట్లో ఏసీబీ సోదాలు
  • ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు
  • ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు

 హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హనుమకొండ డిస్ట్రిక్ట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ (డీటీవో) పుప్పాల శ్రీనివాస్‌‌‌‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుతో శుక్రవారం తెల్లవారుజామున ఏక కాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌‌‌‌ మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీనివాస్ ఇంటితో పాటు హనుమకొండ, భీమారం, వరంగల్‌‌‌‌, జగిత్యాల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు.

తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన సోదాలు.. రాత్రి వరకు కొనసాగాయి. హైదరాబాద్ సహా ఉమ్మడి వరంగల్‌‌‌‌, కరీంనగర్, జగిత్యాలలో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్‌‌‌‌ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వ్యవసాయ భూములు, ప్లాట్స్​సహా మొత్తం రూ.4.5 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటి విలువ మార్కెట్​ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంక్ లాకర్స్‌‌‌‌ ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ మేరకు శనివారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.