పనిచేసేందుకు పైసలు అడిగిన ఆఫీసర్లు..రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్న ఏసీబీ

పనిచేసేందుకు పైసలు అడిగిన ఆఫీసర్లు..రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్న ఏసీబీ
  • లంచం తీసుకుంటూ దొరికిన చౌటుప్పల్‌‌ విద్యుత్‌‌ ఏడీఈ, ధర్మపురి మున్సిపల్‌‌ కమిషనర్‌‌ 

చౌటుప్పల్/జగిత్యాల (ధర్మపురి), వెలుగు : పని చేసేందుకు పైసలు డిమాండ్‌‌ చేసిన ఇద్దరు అధికారులను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ ఏడీఈ శ్యాంప్రసాద్‌‌ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... చౌటుప్పల్‌‌ మున్సిపాలిటీ తంగడపల్లి గ్రామ పరిధిలోని అక్రిట్‌‌ ఫార్మా కంపెనీలో సోలార్‌‌ సిస్టమ్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక్కడ నెట్‌‌ మీటర్‌‌ను అమర్చేందుకు, సీనరైజేషన్‌‌ సిస్టమ్‌‌ ఏర్పాటు చేసుకోవడానికి విద్యుత్‌‌ శాఖ నుంచి పర్మిషన్‌‌ ఇవ్వాల్సి ఉండడంతో కంపెనీ యాజమాన్యం రెండు నెలల కింద డీఈకి అర్జీ పెట్టుకుంది. అయినా డీఈ వెరిఫికేషన్‌‌కు రాకపోవడంతో కంపెనీ యాజమాన్యం చౌటుప్పల్‌‌ ఏడీఈ శ్యాంప్రసాద్‌‌ను కలిసింది. డీఈతో మాట్లాడి పర్మిషన్‌‌ ఇప్పించేందుకు రూ. 70 వేలు ఇవ్వాలని ఏడీఈ డిమాండ్ చేశాడు. దీంతో కంపెనీ సిబ్బంది ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.

వారి సూచనతో గురువారం చౌటుప్పల్‌‌లో ఏడీఈ శ్యాంప్రసాద్‌‌కు డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏడీఈని రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌‌లోని అతడి నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు. ఏడీఈ శ్యాంప్రసాద్‌‌ను అరెస్ట్‌‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిపారు. 

జీతం ఇచ్చేందుకు లంచం అడిగిన ధర్మపురి మున్సిపల్‌‌ కమిషనర్‌‌

జీతం మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన ధర్మపురి మున్సిపల్‌‌ కమిషనర్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్విరాన్‌‌మెంట్‌‌ ఇంజినీర్‌‌ మహేశ్‌‌కు ఆరు నెలలుగా జీతం మంజూరు కావడం లేదు. దీంతో జీతం ఇప్పించాలని కమిషనర్‌‌ శ్రీనివాస్‌‌ను కలిశాడు.

దీంతో రూ. 20 వేలు ఇస్తేనే జీతం వచ్చేలా చేస్తానని కమిషనర్‌‌ చెప్పడంతో మహేశ్‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో ఇంజినీర్‌‌ మహేశ్‌‌ గురువారం కమిషనర్‌‌ను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు కమిషనర్‌‌ను రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి, ఇన్స్‌‌పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.