లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి, ఎడమల లక్ష్మా రెడ్డి అనే కాంట్రాక్టర్ నుండి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా మార్చి 24న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాలు వెల్లడించారు.
రేచపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మించిన బిల్లులను చెల్లించాలని లక్ష్మా రెడ్డి గ్రామ కార్యదర్శి విజయలక్ష్మిని కోరారు. రూ. 10 వేలు లంచంగా ఇస్తేనే బిల్లులు చెల్లిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్చి 17న బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆఫీసులో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజయలక్ష్మిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. మార విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని మార్చి 25 శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు.