తెలంగాణలో అవినీతి అధికారుల చిట్టా పెరిగిపోతుంది. కీసర తహశీల్దార్ నాగరాజు కేసు మరవకముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం ఉదయం మాచవరంలోని అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఎటాక్ చేసి.. నగేష్‌ను పట్టుకున్నారు. జిల్లాలోని 112 ఎకరాలకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ. కోటి 12 లక్షలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా.. నగేష్ ముందుగానే రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు తీసుకుంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మిగతా లంచం డబ్బులు ఇవ్వరేమోనని భావించిన నగేష్.. బాధితుల చేత అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు. నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మాచవరంతో పాటు. నర్పాపూర్, చిలిపిచేడులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని నగేష్ ఫాంహౌస్‌కు ఆయన భార్యను తీసుకెళ్లి సోదాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగేష్‌కు 12 చోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగేష్ గతంలో పనిచేసిన ప్రాంతాలలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
మెదక్ జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ లేకపోవడంతో.. నగేష్ ఇంచార్జ్ కలెక్టర్‌గా అన్నీ తానై చూసుకుంటున్నాడు. లిటిగేషన్ భూములు, వివాదాస్సద భూములపై ఆరా తీయమని కిందిస్థాయి ఉద్యోగులను ఆదేశించినట్లు సమాచారం. ఆ భూములన్నింటికి సెటిల్‌మెంట్ చేద్దామని వారికి సూచించినట్లు సమాచారం.
For More News..