- లంచం అడిగితే ఫిర్యాదు చేస్తున్న పబ్లిక్
- ఏడాది వ్యవధిలో చిక్కిన పలువురు
- మరికొందరి చిట్టా ఉందని ప్రచారం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలోనే ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏసీబీ వద్ద ఇంకా చాలా మంది చిట్టా ఉందని ప్రచారం జరుగుతుండడంతో లంచగొండి ఆఫీసర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎక్కడ నుంచి ఎవరిపై ఫిర్యాదులు వెళ్తాయో.. ఎక్కడ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలో వరుసగా అవినీతిపరులను ఏసీబీ పట్టుకున్న సంగతి తెలిసిందే. రూ. లక్ష చెక్కు వస్తే రూ. 50 వేలు లంచం అడిగిన ఉదంతాలున్నాయి. ఫర్టిలైజర్‌షాపు కోసం లైసెన్స్ కావాలంటూ రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి.
2022 అక్టోబర్13న ట్రైబర్ వెల్ఫేర్ ఆఫీసర్ మంగ్తా నాయక్‌ను ఏసీబీ ఆఫీసర్లు ట్రాప్ చేసి ఆయన వద్ద రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. మంజూరైన రూ. లక్ష బిల్లులో ఆయన రూ. 50 లంచంగా డిమాండ్ చేశారని, అదే డిపార్ట్మెంట్ చెందిన మహిళా ఎంప్లాయ్ ఏసీబీ పట్టిచ్చారు. ఈ సంఘటన జరిగి వారం తిరగకముందే ఎరువుల షాప్ పర్మిషన్ ఇవ్వడం కోసం రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అదే నెల 20న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో వెంకటేశ్వరెడ్డిని ఏసీబీ ట్రాప్ చేసి రూ. లక్ష స్వాధీనం చేసుకుంది.
నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇండ్లపై గతేడాది సెప్టెంబర్‌లో ఏసీబీ జరిపిన దాడుల్లో రూ. 4. 25 కోట్ల ఆస్తులను గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గతేడాది అక్టోబర్‌లో ఆలేరు మండలం శారాజీపేటలో సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. 2 లక్షలు లంచం అడిగిన పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్‌ను ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకుంది. తాజాగా నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం వచ్చిన వ్యక్తిని డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో యాదాద్రి డిస్ట్రిక్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్ వై. సురేందర్‌రెడ్డిని శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జిల్లా ఆఫీసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కావాలని తమను టార్గెట్ చేసుకొని ఏసీబీకి సమాచారం అందిస్తున్నారని కొందరు ఆఫీసర్లు అంటున్నారు.
శుక్రవారం జరిగిన ఏసీబీ దాడులు ప్లాన్ ప్రకారం కొందరు ఏజెంట్లు చేయించారని ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చిన వ్యక్తిని లంచం అడగకుంటే ఎందుకు టార్గెట్ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనుల కోసం వచ్చిన వారిని రూ. వేల కోసం వేధించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరికొందరి చిట్టా ఉందని ప్రచారం
వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు, స్టాఫ్ తమ వద్దకు వచ్చిన వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కొందరైతే డబ్బులు తీసుకొని పని చేయడం లేదంటూ తెలుస్తోంది. డిపార్ట్మెంట్ సమస్యలపై కూడా సొంత స్టాఫ్ వద్ద కొందరు ఆఫీసర్లు ముడుపులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఓ చిన్న ఉద్యోగి వద్ద రూ. 20 వేలు తీసుకొని పని చేయకుండా తిప్పించిన సంఘటనలు ఉన్నాయని
చివరకు మరో పెద్ద ఉద్యోగి జోక్యం చేసుకుంటే పని జరిగిందని అంటున్నారు. బిల్లుల చెల్లింపు విషయంలో పర్సెంటేజీ ఇస్తేనే సరే అంటూ తిప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా డీటీవో చిక్కడంతో మరికొందరి చిట్టా కూడా ఏసీబీ వద్ద ఉందని ప్రచారం మొదలైంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు.
గతంలో కలెక్టర్‌ను కలిసిన హెచ్‌వోడీలు
2022 ఏసీబీ వరుస దాడుల్లో ఆఫీసర్లు పట్టుబడటం, తోటి ఎంప్లాయ్స్ పట్టించిన ఘటనలు జరిగాయి. తాజాగా డీటీవోను ఏసీబీ ట్రాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ పమేలా సత్పతిని పలువురు హెచ్‌వోడీలు కలిసిన సంఘటనను పలువురు ఎంప్లాయ్స్గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి కలెక్టర్ పమేలా సత్పతిని కొన్ని డిపార్ట్ మెంట్ హెచ్‌వోడీలు కలిసి సొంత స్టాఫే ఆఫీసర్‌ను ఏసీబీకి పట్టించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఎవరైనా ఆఫీసర్లు ఒత్తిడి తెస్తే ఏసీబీని కాకుండా 'జిల్లా పెద్దల' దృష్టికి తెస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని
డైరెక్ట్‌గా ఏసీబీని ఆశ్రయించడం వల్ల డిపార్ట్‌మెంట్ పరంగా నష్టం జరుగుతుందని మొర పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ సీరియస్‌గా స్పందించి.. 'జీతాలు బాగానే వస్తున్నాయి కదా..? ఇలా లంచాలు తీసుకోవడం ఎందుకు.. భయపడడం ఎందుకు.? మీ సబార్డినేట్ వద్ద పలుచన కావడం ఎందుకు.? మాకు ఫిర్యాదు ఇవ్వడం. మేము మీకు నోటీసులు ఇవ్వడం లాంటివి ఎందుకన్న ఉద్దేశంతోనే మీ సబార్డినేట్లు నేరుగా ఏసీబీని ఆశ్రయిస్తున్నట్టుగా కనిపిస్తోందని అన్నట్లు సమాచారం. ఇప్పటికైనా జాగ్రత్తగాఉద్యోగాలు చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికిన సంగతిని ఎంప్లాయ్స్గుర్తుకు తెచ్చుకుంటున్నారు.