కర్నూలులో అక్రమాస్తుల అభియోగాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు లో పనిచేస్తున్న కర్నూలు మోటారు వెహికల్ ఇన్స్ పెక్టర్ (MVI) అక్కిరాజు శిప్రసాద్ అక్రమాస్తుల ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. కర్నూలు డాక్టర్స్ కాలనీలోని శ్రీసీతానిలయంలోని నాల్గవ అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 403 లో సోదాలు ప్రారంభించగా.. కిలోకు పైగా బంగారు ఆభరణాలు.. లెక్కాపత్రం లేని లక్షన్నర నగదు పట్టుబడింది. భారీగా అక్రమాస్తులు గుర్తించి కర్నూలుతోపాటు.. హైదరాబాద్ అశోక్ నగర్లో.. తాడిపత్రి, బెంగళూరులో రెండు చోట్ల.. మొత్తం ఐదు చోట్ల సోదాలు ప్రారంభించారు.
శివప్రసాద్ భార్య పేరు మీద.. రెండు డమ్మీ కంపెనీలు (ఇన్ కం ట్యాక్స్ పరిభాషలో సూట్ కేసు కంపెనీలు) తోపాటు.. ఉగాండా దేశంలో కూడా బ్యాంకు అకౌంట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ అశోక్ నగర్ స్టేట్ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించి అక్కడ కూడా సోదాలు చేపట్టారు.
ఇప్పటివరకు జరిపిన సోదాల్లో.. రూ.లక్షన్నర నగదు తోపాటు.. కిలో బంగారు ఆభరణాలు దొరకగా వాటిని సీజ్ చేశారు. వీటితోపాటు.. హైదరాబాద్ గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ ఆర్కేడ్ లో 1.2 కోట్ల విలువైన ప్లాట్.. గాజుల రామారంలో రూ.1 కోట్ల స్థలం డాక్యుమెంట్లు దొరికాయి. అలాగే బెంగళూరు కార్తీక్ నగర్ లో రూ.3 కోట్ల విలువైన జీప్లస్ 2 లో ఆక్సి ట్రీస్ సర్వీస్ అపార్టుమెంట్.. బెంగళూరులోని కుందలహల్లిలో ని రూ.2 కోట్ల జీ ప్లస్ 1 ఇల్లు డాక్యుమెంట్లు దొరికాయి. ఇప్పటి వరకు సోదాల్లో రూ.8 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించామని బ్యాంకు లాకర్ తెరిచి చూడాల్సి ఉంది.. సోదాలు కొనసాగుతున్నాయని కర్నూలు ఏసీబీ డీస్పీ నాగభూషణం తెలిపారు.