వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్

వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్
  • ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం అర్ధరాత్రి ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసింది. ఆ సమయంలో ప్రభుత్వ రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రూ.45,100 సీజ్ చేసింది. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడి చేసి బయట వాహనాలను ఆపుతూ వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు ఐలయ్య అలియాస్ రవి, విజయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. 

ఆ సమయంలో డ్యూటీలో కేవలం ఏఎంవీఐ మాధవి మాత్రమే ఉన్నారు. సీజ్ చేసిన నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు.  ఇతర అధికారుల ప్రమేయం, అక్రమంగా వసూళ్ల తీరుపై పూర్తి రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందిస్తానని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడిలో ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, ఇన్ స్పెక్టర్లు కృష్ణ కుమార్, పున్నం చంద్ర, సిబ్బంది ఉన్నారు.