నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు

నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు
  • రూ.2.93 కోట్ల నగదు..50 తులాల బంగారం స్వాధీనం
  • ఇన్​చార్జ్ ఆర్​వో దాసరి నరేందర్ అవినీతి బాగోతం
  • ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు
  • 17 స్థిరాస్తుల డాక్యుమెంట్లు గుర్తింపు
  • మొత్తం ప్రాపర్టీ విలువ రూ.6 కోట్ల పైనే
  • రోజుకు లక్ష లంచంతో ఇంటికెళ్లేవాడని ప్రచారం

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్​చార్జ్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్​వో) దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులు రావడంతో పొద్దున 5 గంటలకు వినాయక్​నగర్​లోని ఆయన ఫ్లాట్​పై అధికారులు దాడులు చేశారు. రూ.2.93 కోట్ల నగదు, ఆస్తి పత్రాలు, నగలు గుర్తించారు. అతని తల్లి, తమ్ముడు, నిర్మల్ లోని అత్తగారింట్లో ఏకకాలంలో 25 మంది అధికారులు సోదాలు చేశారు. అశోకా టవర్స్ సెకండర్ ఫ్లోర్​లోని 209 ఫ్లాట్​లో ఉంటున్న నరేందర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. బెడ్​రూమ్​లోని సూట్ కేసుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. బెడ్ కింద, కిచెన్ రూంలోనూ వెతకగా మొత్తం రూ.2,93,81,000 నగదు దొరికింది. నాలుగు కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్కించారు. బీరువాలో 51 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తల్లి, భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో రూ.1.10 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.

మున్సిపల్ ఆఫీస్ చాంబర్​లోనూ తనిఖీలు

మున్సిపల్ ఆఫీస్​లోని దాసరి నరేందర్ చాంబర్​లోనూ ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. టేబుల్ డ్రాలో లక్ష రూపాయల క్యాష్, పుణె సిటీకి చెందిన స్థిరాస్తి డాక్యుమెంట్, నిజామాబాద్ సిటీలోని కమర్షియల్ కాంప్లెక్స్ డాక్యుమెంట్లు దొరికాయి. ఇంట్లో నిర్వహించిన సోదాల్లో మొత్తం కలిపి నరేందర్​కు 17 స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. నగదు, నగలతో పాటు డాక్యుమెంట్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. రిజిస్ట్రార్ వ్యాల్యూ ప్రకారం (నగదు కలిపి) మొత్తం రూ.6.07కోట్ల సొత్తును గుర్తించామన్నారు. తమ్ముడు, తల్లితో పాటు అత్తగారింట్లో నిర్వహించిన సోదాల్లో ఏమీ దొరకలేవని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేల్చిన ఏసీబీ అధికారులు.. దాసరి నరేందర్​ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ తరలించారు.

28 ఏండ్లుగా ఒకే చోట తిష్ట

తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద నిజామాబాద్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్​గా దాసరి నరేందర్ ఉద్యోగం ప్రారంభించాడు. తర్వాత ఒకే సెక్షన్​లో ఆర్ఐగా, సూపరింటెండెంట్​గా ప్రమోషన్ పొందాడు. ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్​లకు ప్రాపర్టీ ట్యాక్స్ ఫిక్స్ చేయడంలో కీ రోల్ నరేందర్​దే. నిజామాబాద్ మున్సిపాలిటీ హోదా నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరింది. పలుమార్లు ట్రాన్స్​ఫర్లు జరిగినా.. తన పలుకుబడితో 28 ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నాడు. పాలకవర్గంలోని కొంత మంది సభ్యులు నరేందర్​కు సపోర్ట్ చేసేవారని తెలిసింది. ప్రతి రోజూ ఇంటికి లక్షకు తక్కువ కాకుండా లంచం పట్టుకెళ్లేవాడనే ప్రచారం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో దాసరి నరేందర్​పై మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో బోధన్ మున్సిపాలిటీకి ఆయన్ను ట్రాన్స్​ఫర్ చేసినా.. రద్దు చేయించుకుని మరీ నిజామాబాద్ వచ్చాడు. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ కూడా అయ్యాడు. మళ్లీ తన పలుకుబడితో పోస్టింగ్ తెచ్చుకున్నడు. నరేందర్ పై గత కొన్ని రోజుల పాటు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. పక్కా ప్లాన్​తో ఇంటిపై దాడులు చేశారు. ఎవరినీ ఇంటి నుంచి బయటికి వెళ్లనీయకుండా పొద్దున ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు దాకా సోదాలు నిర్వహించారు. సోదాలు ఇంకా కంటిన్యూ చేస్తామని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.