- గత నెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా
- ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు
- ఒకేసారి ఆరు చోట్ల తనిఖీలు
హనుమకొండ, వెలుగు: ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ గత నెల ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఇంట్లో సోమవారం ఏసీబీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. తస్లీమా మార్చి 22న ఏసీబీకి పట్టుబడిన టైంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలో సోమవారం తనిఖీలు చేశారు.
హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమాతో పాటు ఆమె సోదరుల పేరున ఉన్న ఐదు ఇండ్లు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో ఒకేసారి తనిఖీలు చేసిన ఆఫీసర్లు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. తన కుటుంబసభ్యుల పేరున ఇండ్లు, భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తస్లీమా, ఆమె కుటుంబ సభ్యుల పేరున రూ.2.07 కోట్ల విలువైన ఐదు ఇండ్లు, రూ.12 లక్షల విలువైన ఆరు ఇండ్ల స్థలాలు, ములుగులో రూ.20.40 లక్షల విలువైన మూడెకరాల వ్యవసాయ భూమి, రూ.1.92 లక్షలు, రూ.98,787 బ్యాంక్ బ్యాలెన్స్, ఒక కియా కారు, రెండు బుల్లెట్బైక్లు ఉన్నట్లు తేల్చారు.
వాటన్నింటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.2,94,84,547 వరకు, బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం రూ.25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం తస్లీమా కరీంనగర్ జైలులో ఉండగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఎంక్వైరీ చేస్తున్నామని, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.