
- గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 20 వేలు డిమాండ్
- సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేట్ అసిస్టెంట్ అరెస్ట్
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన స్టేషన్ ఘన్‌పూర్ సబ్‌రిజిస్ట్రార్‌ను ఏసీబీ ఆఫీసర్లు గురువారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటేశ్వరపల్లెకు చెందిన బట్టమేకల యాదగిరికి ఇద్దరు కుమారులు. గ్రామంలో తనకు ఉన్న స్థలాన్ని ఇద్దరు కొడుకుల పేరుతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు పెద్దకొడుకు శివరాజుతో కలిసి సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణను కలిశాడు.
పని పూర్తయ్యేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని సబ్‌రిజిస్ట్రార్ చెప్పడంతో శివరాజు హనుమకొండలోని ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం సాయంత్రం శివరాజు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి రామకృష్ణను కలువగా ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. దీంతో శివరాజు రమేశ్ వద్దకు వెళ్లి రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రమేశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణ సూచనతోనే రమేశ్ డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి, హనుమకొండలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.