ఏసీబీకి డబుల్ క్లైమ్ కేసు ఎంక్వైరీ

ఏసీబీకి డబుల్ క్లైమ్ కేసు ఎంక్వైరీ
  • ప్రాపర్టీ అటాచ్​మెంట్ ఉండడంతో పోలీసుల నిర్ణయం
  • రూ.20 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అంచనా
  • మూడు రోజుల పోలీస్ కస్టడీలో నోరు మెదపని నిందితుడు

గద్వాల, వెలుగు: డబుల్ క్లైమ్​  కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరగాలని, ప్రాపర్టీ అటాచ్​మెంట్ ఉందని తేలడంతో పోలీసులు ఏసీబీ ఎంక్వైరీ చేయాలని సిఫారసు చేశారు. డబల్  క్లైమ్  కేసులో త్వరలోనే ఏసీబీ ఎంక్వైరీ జరగనుంది. జూరాల, గట్టు లిఫ్ట్, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల పరిహారంచెల్లింపులో కోర్టు సూపరింటెండెంట్​ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో డబ్బు రికవరీ అవుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. 

ఈ తరుణంలో ఏసీబీ ఎంక్వైరీకి పోలీసులు సిఫారసు చేయడంతో డబుల్  క్లైమ్  కుంభకోణంలో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డబుల్  ఎంట్రీతో రూ.3,08,33,160 తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకొని కుంభకోణానికి తెరలేపారని గద్వాల కోర్టు జడ్జి అంతర్గతంగా చేసిన ఎంక్వైరీలో తేలింది. ఆ తరువాత హైకోర్టు డైరెక్షన్స్ తో ఇటీవల కేసు నమోదైంది. కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన పెద్దలు కేసు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏసీబీ ఎంక్వైరీ కోరడంతో విచారణ ముందుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రాపర్టీ అటాచ్​మెంట్ ఉండడంతో..

డబుల్  క్లైమ్  కేసులో ప్రాపర్టీ అటాచ్​మెంట్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఏసీబీ ఎంక్వైరీ కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల పోలీసులు నిందితుడిని మూడు రోజులు పోలీస్  కస్టడీకి తీసుకొని విచారించారు. డబ్బు రికవరీపై స్పష్టత లేకపోవడంతో ప్రాపర్టీ అటాచ్​మెంట్  చేయాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :- గర్జించిన మాలలు

20 కోట్లకు పైగానే కుంభకోణం..

మొదట మూడు కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అంతర్గత ఎంక్వైరీలో బయటపడగా, రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. హైకోర్టు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో కోర్టు సీనియర్  సూపరింటెండెంట్  నిర్మల అక్టోబర్  22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 477 ఏ, 409, 465,468,420 బి రెడ్  విత్  34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన కోర్టు మాజీ సూపరింటెండెంట్  సత్యనారాయణ పోలీసులకు దొరకకుండా కోర్టులో లొంగిపోయాడు.

 నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు3 రోజుల కస్టడీకి పర్మిషన్​ ఇచ్చింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ, ఎలాంటి పురోగతి కనిపించలేదు. పొంతన లేని సమాధానాలతో కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఏసీబీ ఎంక్వైరీతో గుట్టు రట్టయ్యేనా?

కోర్టులో జరిగిన డబుల్  క్లైమ్  కుంభకోణంలో ప్రస్తుతం కోర్టు మాజీ సూపరింటెండెంట్, ఆయన భార్యపై కేసు నమోదైంది. ఈ కేసులో చాలామంది కీలక సూత్రధారులు ఉన్నారనే ఆరోపణలున్నాయి. కొందరు లాయర్లతో పాటు మరికొందరు ఈ కేసులో ఇన్వాల్​మెంట్​ అయ్యారని అంటున్నారు. 2016 నుంచి 2021 వరకు ఈ వ్యవహారం జరిగినా, విషయాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టకేలకు కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎంక్వైరీలో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఏసీబీ ఎంక్వైరీతోనైనా గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు.

ఏసీబీ ఎంక్వైరీ కోరాం..

గద్వాల కోర్టులో జరిగిన డబుల్  క్లైమ్​ కేసులో ఏసీబీ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవమే. ఈ కేసులో ప్రాపర్టీ అటాచ్​మెంట్  ఉండడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో ఎంత అవినీతి జరిగిందనే విషయం ఇంకా తేలలేదు.-  శ్రీనివాసులు, సీఐ కేసు ఇన్వెస్టిగేషన్  ఆఫీసర్