- కల్యాణలక్ష్మి ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్
డిండి, వెలుగు : కల్యాణలక్ష్మి ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకున్న ఓ ఆర్‌ఐని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా డిండి మండలంలోని పడమటి తండాకు చెందిన ఓ వ్యక్తి 2021లో తన కూతురు వివాహం చేశాడు. తర్వాత 2023లో కల్యాణలక్ష్మి స్కీమ్ కోసం అప్లై చేసుకున్నాడు.
ఈ ఫైల్ ఆర్‌ఐ శ్యాంనాయక్ వద్దకు రావడంతో దానిని ప్రాసెస్ చేసేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేని సదరు వ్యక్తి కోరడంతో రూ. 5 వేలకు ఆర్‌ఐ ఒప్పుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి నల్గొండలోని ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో శుక్రవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న ఆర్‌ఐకి రూ. 5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌ఐ శ్యాంనాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిండి ఆర్‌ఐ ఆఫీస్‌లో రికార్డ్స్ పరిశీలించిన అనంతరం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో ఇన్స్‌పెక్టర్లు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు.