ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు
  • రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గద్వాల డీపీవో, పంచాయతీ సెక్రటరీ
  • రూ.15 వేలు తీసుకుంటూ నల్గొండ జిల్లా మర్రిగూడలో సర్వేయర్..​

గద్వాల, వెలుగు: అన్నపూర్ణ గ్రీన్  ల్యాండ్  వెంచర్  ఓనర్  నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్  శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్  నియోజకవర్గంలోని పుల్లూరు పంచాయతీ పరిధిలో సర్వే నంబర్  435/ ఏలో అన్నపూర్ణ గ్రీన్  ల్యాండ్  వెంచర్ ను మహమ్మద్  ఎజాజ్  వేస్తున్నారు. 

రూల్స్ కు విరుద్ధంగా వెంచర్  వేస్తున్నారని డీపీవో, పంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. వెంచర్​ నిర్వాహకుడు డీపీవోను కలవగా, అన్ని సక్రమంగా జరగాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్  చేశారు. బేరమాడి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని, ఆ తరువాత ఏసీబీని అప్రోచ్  అయ్యారు. వారి సూచన మేరకు అలంపూర్ లోని ఆంజనేయస్వామి టెంపుల్  సమీపంలో వెంచర్  ఓనర్  నుంచి పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్​ రూ.2 లక్షలు తీసుకోగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

వీటిలో రూ.1.50 లక్షలు డీపీవోకు, రూ.50 వేలు పంచాయతీ సెక్రటరీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. డీపీవో, పంచాయతీ సెక్రటరీని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐ షేక్  సయ్యద్  అబ్దుల్  ఖాదర్  జిలాని, ఎస్సై లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

మర్రిగూడలో సర్వేయర్..

చండూరు: నల్గొండ జిల్లా మర్రిగూడ సరంపేట గ్రామానికి చెందిన రైతు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌మూడవత్ మురళీధర్ కు చెందిన 8 గుంటల భూమి సర్వే చేసేందుకు సర్వేయర్  రవినాయక్ రూ.15 వేలు డిమాండ్  చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం తహసీల్దార్  ఆఫీస్​లో సర్వేయర్ కు రూ.12 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్  హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్​ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.