ఆయన ఉద్యోగం ఏడీఈ.. ఆస్తులు రూ. 100 కోట్లు..!

ఆయన ఉద్యోగం ఏడీఈ.. ఆస్తులు  రూ. 100 కోట్లు..!

ఏసీబీ అధికారులు అవినీతి అధికారులు భరతం పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అవతారాన్ని బహిర్గతం చేసి ఊచలు లెక్కించే దిశగా ఏసీబీ  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  తాజాగా ఓ విద్యుత్​ అధికారిని ఏసీబీ శాఖ ట్రాప్​ చేసి పట్టుకుంది.

గచ్చిబౌలిలోని విద్యుత్‌ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న సతీశ్‌ 50 వేల రూపాయిలు లంచం తీసుకుంటూ  ఏసీబీకి పట్టుబడ్డాడు. సతీశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిచారు.తరువాత .. సతీష్​ అక్రమాస్తుల చిట్టాను పరిశీలించేందుకు రెండు రోజులపాటు మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 

ఏసీబీకు పట్టుబడ్డ విద్యుత్​ శాఖ ఏడీఈ సతీశ్‌  విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఆయనకు హైదరాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, విల్లా, ఓపెన్‌ప్లాట్లు, భవనాలు ఉన్నట్టు గుర్తించారు.

 శంకర్‌పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, నగర శివారులో ఒక విల్లా, పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లో 4 ఫ్లాట్లు, కిలో బంగారం, ఇతర బ్యాంకు బ్యాలెన్సులు సహా పలు ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.వీటితో పాటు నెలకు లక్ష రూపాయిలు రెంట్​ వచ్చే  కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉందని  తెలుస్తోంది. మొత్తంగా సతీశ్‌ ఆస్తుల విలువ రూ.100కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సతీష్​ ఉద్యోగ వివరాలు

విద్యుత్​ శాఖలో 2006 వ సంవత్సరంలో ఏఈగా చేరాడు.  తరువాత ప్రమోషన్​ పై చర్లపల్లి సబ్‌ డివిజన్‌లో ఆపరేషన్స్‌ ఏడీఈ గా బాధ్యతలు స్వీకరించారు.  2024 అక్టోబర్​ లో విద్యుత్​ శాఖలో జరిగిన బదిలీల్లో అక్రమంగా.. నిబంధనలకు విరుద్దంగా.. పైరవీ చేసి గచ్చిబౌలి ఏడీఈగా బదిలీ అయ్యాడని సమాచారం అందుతోంది.  గచ్చిబౌలి సబ్​డివిజన్​లో జరిగే ప్రతి పని కూడా తన దృష్టికి రావాలని ఆంక్షలు విధించాడని విమర్శలున్నాయి.  అపార్ట్​ మెంట్స్​, విల్లాలకు విద్యుత్​ కనక్షన్​ మంజూరు చేసేందుకు బాహాటంగానే డబ్బులు తీసుకొనేవాడని ఆరోపణలున్నాయి. 

అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్థుల విద్యుత్‌ కనెక్షన్లకు అంచనాలు, కనెక్షన్లు మంజూరు చేసేందుకు సతీష్‌ ఆఫీసులోనే దర్జా డబ్బులు తీసుకునేవాడనే ప్రచారం ఉంది. గచ్చిబౌలి ఏడీఈగా వచ్చిన తర్వాత సబ్‌ డివిజన్‌లో జరిగే ప్రతి పని తన దృష్టిలోకి వచ్చిన తర్వాతే జరగాలంటూ నిబంధనపెట్టాడనే విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే ఫైళ్లను పక్కన పెట్టి..50 వేల నుంచి రూ.లక్ష డిమాండ్‌ చేసేవాడని ప్రచారం ఉంది.