ఏసీబీకి చిక్కిన పీఆర్‌‌ ఏఈ

  • సీసీ రోడ్ల బిల్స్‌‌ క్లియరెన్స్‌‌ కోసం రూ. 5 వేలు డిమాండ్‌‌
  • మాజీ సర్పంచ్‌‌ నుంచి డబ్బులు తీసుకోగా పట్టుకున్న ఏసీబీ

హనుమకొండ, వెలుగు :  సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లుల ఫైల్‌‌ను క్లియర్‌‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌‌ చేసిన పంచాయతీ రాజ్‌‌ ఏఈ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబట్టాడు. మాజీ సర్పంచ్‌‌ నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం సర్పంచ్‌‌గా పనిచేసిన మంద సతీశ్‌‌ ఉపాధి హామీ నిధులతో గ్రామంలో పలు చోట్ల సీసీ రోడ్లు వేశారు. సుమారు రూ. 9 లక్షల విలువైన పనులు 2023 జనవరిలోనే పూర్తయ్యాయి. 

ALSO READ : రవాణా శాఖలో 8 మందికి ప్రమోషన్‌‌‌‌

వాటికి సంబంధించిన బిల్స్‌‌ కోసం పలుమార్లు పంచాయతీరాజ్‌‌ ఆఫీసర్లను కలిసినా బిల్లులు క్లియర్‌‌ కాలేదు. దీంతో పంచాయతీరాజ్‌‌ డ్రాయింగ్‌‌ బ్రాంచ్‌‌ ఏఈ గాదె కార్తీక్‌‌ను సంప్రదించగా, బిల్స్‌‌ క్లియర్‌‌ చేసేందుకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశాడు. దీంతో సతీశ్‌‌ వరంగల్‌‌ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్‌‌లో ఉన్న ఏఈ కార్తీక్‌‌ను కలిసి రూ. 5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈ కార్తీక్‌‌ను రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అక్కడి నుంచి వరంగల్‌‌ జడ్పీ ఆఫీస్‌‌కు చేరుకొని పంచాయతీ రాజ్‌‌ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. అనంతరం కార్తీక్‌‌ను అదుపులోకి తీసుకుని, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.