- రీసైక్లింగ్ దందాతో కోట్లు దండుకున్న అధికారులు, దళారులు
- ఒక్కో యూనిట్‌కు రూ.20 నుంచి రూ.30 వేల వరకు దోపిడీ
- మంచిర్యాల జిల్లాలో అక్రమాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు
- తూతూమంత్రంగా అప్పటి ఎండీ ఎంక్వైరీ
- తాజాగా జిల్లాల నుంచి రిపోర్ట్ తీసుకున్న ఏసీబీ, విజిలెన్స్ అధికారులు
మంచిర్యాల, వెలుగు: గొర్రెల స్కామ్‌పై ఏసీబీ, విజిలెన్స్ ఎంక్వైరీతో అక్రమార్కుల్లో టెన్షన్ మొద లైంది. ఈ దందాలో కోట్లు దండుకున్న తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని అవినీతి అధికారులు, దళారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు వెటర్నరీ డాక్టర్లు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గొర్రెల స్కామ్‌లో పలువురు నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ, విజిలెన్స్ అధికారులు తాజాగా అన్ని జిల్లాల నుంచి రిపోర్టులు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని ఆరా తీస్తున్నారు.
ఆఫీసర్లు, బ్రోకర్లు మిలాఖత్
గత బీఆర్ఎస్ సర్కారు గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసమంటూ 2017లో గొర్రెల స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫస్ట్ ఫేజ్‌లో వెటర్నరీ డాక్టర్ల ద్వారా గొర్రెలు పంపిణీ చేశారు. ఇందులో డాక్టర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సర్కారు ఎంక్వైరీలో తేలింది. దీంతో సెకండ్ ఫేజ్‌లో డాక్టర్లను తప్పించి జేడీలకు గొర్రెల పంపిణీ బాధ్యతలను అప్పగించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని జిల్లాలకు పాయింట్లను కేటాయించారు. అక్కడ జేడీ స్థాయి ఆఫీసర్లను ఇన్‌చార్జీలుగా నియమించారు.
లబ్ధిదారులు వారికి కేటాయించిన పాయింట్లకు వెళ్లి ఇన్చార్జి ఆఫీసర్లను కలిస్తే వారు బ్రోకర్లకు అప్పజెప్పారు. ఈ బ్రోకర్లు బక్కచిక్కిన, చిన్న గొర్రెలను చూపించి అవే తీసుకోవాలని, లేదంటే రూ.80 వేల నుంచి రూ.90 వేలే ఇస్తామని చెప్పారు. అప్పటికే విసిగిపోయిన లబ్ధిదారులు కొందరు యూనిట్‌కు 15 గొర్రెలను తీసుకున్నారు. నచ్చనివాళ్లు బ్రోకర్లు ఇచ్చినంత తీసుకొని ఇంటి దారి పట్టారు. ఈ దందాలో బ్రోకర్లు, కొంతమంది ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు భారీగా దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
పెద్ద ఎత్తున రీసైక్లింగ్..
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఏపీ, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాల్లో గొర్రెలను కొన్నారు. వీటి రవాణా మొదలు లబ్ధిదారులకు చేరుకునే వరకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గొర్రెలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు ఇచ్చినట్టు చూపించి రీసైక్లింగ్ చేశారు. కొన్నిచోట్ల గొర్రెలను జిల్లాకు తీసుకువచ్చి వాటితో కలిపి లబ్ధిదారుల ఫొటోలు తీసి తిరిగి పంపించారనే విమర్శలు వచ్చాయి.
పలువురు లబ్ధిదారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా ఇచ్చి తిరిగి అవే గొర్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇలా గొర్రెలు కొనకుండానే కొన్నట్టు, ట్రాన్స్‌పోర్టు చేయకుండానే చేసినట్టు రికార్డులు సృష్టించి కోట్లలో దోచుకున్నారు. ఆ మొత్తాన్ని అధికారులు, బ్రోకర్లు కలిసి పంచుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.
మంచిర్యాలలో భారీగా అక్రమాలు..
మంచిర్యాల జిల్లాలో గొర్రెల స్కీమ్‌లో భారీగా అక్రమాలు జరిగాయని అప్పట్లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ఆరోపించారు. 2022 జనవరిలో జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ విషయమై పెద్ద దుమారమే రేగింది. సెకండ్ ఫేజ్‌లో ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు 15, 16 మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. 20 కిలోల బరువున్న గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, చిన్నవి, బక్కచిక్కినవి ఇచ్చారు.
దీంతో ట్రాన్స్‌పోర్టు చేస్తున్న టైంలోనే వందలాది గొర్రెలు చనిపోయాయి. గొర్రెల చెవులకు వేసిన ట్యాగ్లు మారుస్తూ నాలుగైదుసార్లు రీసైక్లింగ్ చేశారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. 15 గొర్రెలు ఇచ్చి 21 గొర్రెలకు ఇన్య్సూరెన్స్ చేశారని, వీటి ఫొటోలు, ఆధారాలు తనవద్ద ఉన్నాయని జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ నిలదీశారు. రెండు విడతల్లో పంపిణీ చేసిన వాటిలో 10 శాతం కూడా లబ్ధిదారుల దగ్గర లేవని, ఉంటే చూపించాలని అధికారులకు సవాల్ విసిరారు.
తూతూమంత్రంగా ఎంక్వైరీ
గొర్రెల స్కీమ్‌లో అక్రమాలు జరిగినట్టు స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆరోపించడంతో ఈ పథకంలో డొల్లతనం బట్టబయలైంది. దీంతో అప్పటి యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ సబావత్ రాంచందర్ మంచిర్యాల జిల్లాలో తూతూమంత్రంగా ఎంక్వైరీ జరిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఆరా తీశారు. త్రీమెన్ కమిటీ ద్వారా మరింత లోతుగా విచారణ జరిపిస్తామని చెప్పినా తర్వాత ఎంక్వైరీ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆయనే గొర్రెల స్కామ్‌లో కీలక సూత్రధారిగా అరెస్టు కావడం గమనార్హం.