ఇక నోరెత్తరు.. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

ఇక నోరెత్తరు.. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

ఏసీసీ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌-2023 టోర్నీలో భారత యువ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పాక్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన భారత యువ ఆటగాళ్లు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 48 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఓపెనర్ సయీమ్‌ ఆయుబ్‌ 11 బంతులాడి డకౌట్‌‌గా వెనుదిరగగా.. అతని స్థానంలో వచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైర్‌ యూసఫ్‌ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు.  దీంతో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో మరో ఓపెనర్‌ షాహిజాదా ఫర్హాన్‌(35), హసీబుల్లా ఖాన్‌(27) కాసేపు జట్టును ఆదుకున్నారు. 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

అయితే, పవర్ ప్లే ముగిశాక భారత స్పిన్నర్లు ఎంటర్ అవ్వడంతో పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. బ్యాటర్లు పోటీపడుతూ ఒకరివెంట మరొకరు అన్నట్లు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో హంగేర్గకర్‌ 5 వికెట్లు పడగొట్టగా.. మానవ్‌ సుతార్ 3, రియాన్‌ పరాగ్‌, నిషాంత్‌ సింధు ఒక్కో వికెట్‌ తీశారు.

అనంతరం 206 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత్‌ 36.4 ఓవర్లలోనే ఛేదించింది. ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్‌(104) సెంచరీతో చెలరేగగా.. నికిన్ జోస్(53) హాఫ్ సెంచరీ చేశాడు. పాక్ కెప్టెన్  మహమ్మద్ హ్యారిస్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించనప్పటికీ.. ఏమాత్రం ఫలితం దక్కలేదు. ఈ విజయంతో భారత ఏ జట్టు 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలించింది.