ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫి వేదిక, షెడ్యూల్ ఖరారు చేసేందుకు శుక్రవారం (నవంబర్ 29) ఐసీసీ నిర్వహించిన కీలక సమావేశంలోనూ చిక్కుముడి వీడలేదు. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ ససేమిరా అనగా.. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ నిరాకరించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌లోనూ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో.. సమావేశాన్ని ఐసీసీ శనివారానికి వాయిదా వేసింది.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించాలని లేదా టోర్నమెంట్ అతిథ్య బాధ్యతల నుండి పక్కకు తప్పుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ పాల్గొనకపోతే బ్రాడ్ కాస్టర్లు ఎవరూ ముందుకు రారని.. ఇది టోర్నీ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోందని పీసీబీకి ఐసీసీ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
శనివారం (నవంబర్ 30) జరిగే సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీ నిర్వహణకు అంగీకరిస్తే సరి.. లేదంటే టోర్నమెంట్‌ను పూర్తిగా వేరే దేశానికి మార్చవలసి ఉంటుందని.. టోర్నీలో పాక్ జట్టు కూడా ఉండదని పీసీబీని ఐసీసీ హెచ్చరించినట్లు ఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాకిస్థాన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, దౌత్యపరమైన అంశాలు, ఆటగాళ్ల భద్రతాను దృష్టిలో పెట్టుకుని ఛాంపియన్స్ ట్రోఫి కోసం దాయాది దేశం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే.