- ఉమ్మడి జిల్లాలో భారీగా నామినేషన్లు
- 13న స్ర్కూట్నీ, 15న ఉపసంహరణ, ఫైనల్ లిస్టు రిలీజ్
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. చివరి రోజు శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. 13న నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించి పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.
- కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి ఎంపీ బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్ నామినేషన్లు సమర్పించారు.
- మానకొండూరులో 20 మంది 42 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), రసమయి బాలకిషన్(బీఆర్ఎస్), ఆరేపల్లి మోహన్(బీజేపీ) పోటీలో ఉన్నారు.
- హుజూరాబాద్‌లో 33 అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వొడితల ప్రణవ్(కాంగ్రెస్), పాడి కౌశిక్ రెడ్డి(బీఆర్ఎస్), ఈటల రాజేందర్(బీజేపీ), పల్లె ప్రశాంత్(బీఎస్పీ)ఉన్నారు.
- చొప్పదండి నుంచి 18 మంది 37 సెట్ల నామినేషన్లు వేశారు. సుంకె రవిశంకర్(బీఆర్ఎస్) , మేడిపల్లి సత్యం(కాంగ్రెస్), బొడిగె శోభగాలన్న(బీజేపీ) పోటీలో ఉన్నారు.
- జగిత్యాలలో డాక్టర్ సంజయ్(బీఆర్ఎస్),టి.జీవన్ రెడ్డి(కాంగ్రెస్), భోగ శ్రావణి(బీజేపీ)తో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి 18 మంది నామినేషన్ వేశారు.
- కోరుట్లలో ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు, డాక్టర్ కె.సంజయ్ (బీఆర్ఎస్), ఎంపీ డి.అర్వింద్(బీజేపీ), జువ్వాడి నర్సింగరావు( కాంగ్రెస్) ఇతర పార్టీలు, స్వతంత్రులు 20 మంది బరిలో ఉన్నారు.
- ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్), ఎస్.కుమార్(బీజేపీ) తో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు15 మంది నామినేషన్ వేశారు.
- రామగుండం నియోజకవర్గం నుంచి మొత్తం 31 నామినేషన్లు దాఖలు కాగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు.
- మంథని నియోజకవర్గంలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. పుట్ట మధుకర్(బీఆర్ఎస్), సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు(కాంగ్రెస్), చందుపట్ల సునీల్‌రెడ్డి(బీజేపీ) ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ఆశించి భంగపడ్డ చల్లా నారాయణరెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి(బీఆర్ఎస్), విజయరమణారావు(కాంగ్రెస్), దుగ్యాల ప్రదీప్‌రావు(బీజేపీ), దాసరి ఉష( బీఎస్పీ) ఉన్నారు.
వేములవాడ బీజేపీ టికెట్ వికాస్‌రావుకు...
రాజన్నసిరిసిల్ల,వెలుగు :రాజన్నసిరిసిల్ల జిల్లాలో 45 మంది అభ్యర్థులు 82 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వేములవాడలో 22 మంది అభ్యర్థులకు 39 సెట్స్, సిరిసిల్లలో 23 మంది 43 సెట్స్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు మధ్యాహ్నం సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ నామినేషన్ వేశారు. వేములవాడకు టికెట్తొలుత తుల ఉమకు కేటాయించగా ఆమె నామినేషన్ వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆమెకు బీఫాం నిరాకరించి చెన్నమనేని వికాస్ రావుకు ఇవ్వడంతో ఆయన నామినేషన్ వేశారు. జిల్లాలో ప్రధాన పార్టీల మంత్రి కేటీఆర్, కేకే మహేందర్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.
ALSO READ: తుల ఉమకు షాక్