భూమికి భూమి ఇస్తేనే ఒప్పుకుంటం : ట్రిపుల్​ ఆర్​ బాధితులు

  • యాదాద్రి ట్రిపుల్​ ఆర్ ​బాధితులు

యాదాద్రి, వెలుగు: భూమికి భూమి ఇస్తేనే రోడ్డు నిర్మాణానికి తమ భూములిస్తామని ట్రిపుల్​ ఆర్​ బాధితులు చెప్పారు. యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు కోసం 1,853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనికోసం 2022 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా జిల్లావ్యాప్తంగా 23 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారు. ఇందులో భువనగిరి మండలంలో 16 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూములు ఇచ్చామని, ఇప్పుడు  ట్రిపుల్ ఆర్ కు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో అభ్యంతరాలు తెలపాలని  ఇటీవల రాయగిరి రైతులతో మీటింగ్​నిర్వహించిన ఆఫీసర్లు శనివారం కేసారం, పెంచికలపహాడ్, గౌస్​నగర్, ఎర్రంబెల్లి, తుక్కాపురం రైతులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ మీటింగ్ కు వచ్చిన రైతులు తాము భూములు ఇవ్వలేమని భువనగిరి ఆర్డీవో భూపాల్​రెడ్డికి తేల్చి చెప్పారు. మార్చిలో విడుదల చేసిన గెజిట్​లో భువనగిరి, నందనం గ్రామాలు ఉన్నాయని, సెప్టెంబర్​లో విడుదల చేసిన నోటిఫికేషన్​లో ఈ రెండు గ్రామాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఘట్కేసర్ లో రింగ్ రోడ్డు ఉండగా మళ్లీ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని, గతంలో రూపొందించిన రెండు ఆలైన్ మెంట్లు ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఎలాంటి నష్టం జరగకుండా రైతుల భూములు మాత్రమే తీసుకునే విధంగా ఆలైన్ మెంట్ రూపొందించినట్టుగా కన్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రింగ్​ రోడ్డు కోసం తమ వద్ద ఎంత భూమి తీసుకుంటారో అంతే భూమి ఇస్తే ఆలోచిస్తామని రైతులు చెప్పారు. అలా కాకుండా పరిహారం ఇచ్చి భూమిని తీసుకుంటామంటే తాము ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు.