వంగూర్, వెలుగు: చారగొండ మండలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సీఎం సహకారంతో డెవలప్ చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శనివారం జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ తో కలిసి శిరసనగండ్ల ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి గాంచిన సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు సౌలతులు కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆహ్వానిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. బలరాం గౌడ్, భీముడు నాయక్, నరసింహారెడ్డి, వెంకట్ గౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అమ్రాబాద్: గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. మండలంలోని మాచారం గ్రామంలో నిర్వహించిన సీతారామాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవానికి సతీమణితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సొంత గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్న అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ జలేందర్ రెడ్డి సోదరులను అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు.