సర్వేకు సహకరించిన వారికే స్థానిక సంస్థల్లో చాన్స్ : ఎమ్మెల్యే వంశీకృష్ణ

సర్వేకు సహకరించిన వారికే స్థానిక సంస్థల్లో చాన్స్ : ఎమ్మెల్యే  వంశీకృష్ణ
  • కార్యకర్తల సమావేశంలో అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు

నాగర్​కర్నూల్,​ వెలుగు: దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా తెలంగాణలో ప్రారంభం కానున్న సమగ్ర కుటుంబ సర్వేలో కాంగ్రెస్​ క్యాడర్​ కీలకంగా వ్యవహరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. శనివారం తమ క్యాంప్​ ఆఫీసుల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి సమగ్ర సర్వేలో ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక న్యాయం అందించేందుకు చేపట్టిన సర్వేలో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం, కాంగ్రెస్​ పార్టీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

 గ్రామాలు, హామ్లెట్​ విలేజ్​లు, మున్సిపల్​ వార్డుల వారీగా నిర్వహించే సర్వేకు కాంగ్రెస్​ క్యాడర్​  తోడుగా ఉండాలని సూచించారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు కాంగ్రెస్​  కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని, సర్వేకు సహకరించే వారికే స్థానిక సంస్థలు, మున్సిపల్​ ఎలక్షన్​లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్​ క్యాడర్​పై ఉందన్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై గుర్తింపు పొందేందుకు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. ఈ సమావేశాల్లో మున్సిపల్, మార్కెట్​ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్​ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.