పండుగ పూట ప్రమాదాలు

పండుగ పూట ప్రమాదాలు
  • హోలి అనంతరం స్నానానికి వెళ్లి నీటిలో పడి ఇద్దరు యువకులు మృతి
  • వేడుకలు జరుపుకొని బైక్‌‌పై 
  • తిరిగి వస్తుండగా యాక్సిడెంట్లు ఇద్దరు స్టూడెంట్లు మృత్యువాత

హోలి పండుగ పూట పలు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు స్టూడెంట్లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వేడుకల అనంతరం స్నానం చేసేందుకు కాల్వ, నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందగా ఫ్రెండ్స్‌‌తో కలిసి వేడుకలు జరుపుకొని బైక్‌‌పై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు.

ఎస్సారెస్పీ కెనాల్‌‌లో పడి...

జగిత్యాల రూరల్‌‌, వెలుగు : స్నేహితులతో కలిసి హోలి ఆడిన యువకుడు తర్వాత స్నానానికి కెనాల్‌‌లో దిగగా ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల రూరల్‌‌ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన సాగర్‌‌ (32) కొంతకాలంగా జగిత్యాలలో ఉంటున్నాడు. 

శుక్రవారం హోలీ సందర్భంగా ఫ్రెండ్స్‌‌తో కలిసి సరదాగా గడిపాడు. అనంతరం వెల్దుర్తి బావాజీపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌‌లో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్‌‌ సిబ్బంది కెనాల్‌‌ గేట్లు మూసి, నీటిలో గాలించి డెడ్‌‌బాడీని బయటకు తీశారు. 

పాణహిత నదిలో స్నానానికి వెళ్లి...

బెల్లంపల్లిరూరల్, వెలుగు : వేమనపల్లి మండల కేంద్రంలోని బెస్తవాడకు చెందిన కంపెల రాజ్‌‌కుమార్‌‌ (21) శుక్రవారం ఫ్రెండ్స్‌‌తో కలిసి హోలి వేడుకలు జరుపుకున్నాడు. తర్వాత నవీన్, అనిల్, రాకేశ్‌‌, అభిషేక్, సాయికిరణ్‌‌తో కలిసి స్నానానికి ప్రాణహిత పుష్కరఘాట్‌‌ ఎగువన ఉన్న మొహిబిన్‌‌ పేట రేవు వద్దకు వెళ్లాడు. 

సాయికిరణ్‌‌, రాజ్‌‌కుమర్‌‌ నదిలో దిగి స్నానం చేస్తుండగా మిగతా వారు ఒడ్డునే కూర్చున్నారు. నది లోతు ఎక్కువగా ఉండడంతో రాజ్‌‌కుమార్‌‌ నీటిలో మునిగిపోయాడు. గమనించిన సాయికిరణ్‌‌ కాపాడే ప్రయత్నం చేస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన మిగతా ఫ్రెండ్స్‌‌ ఫోన్‌‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాగా వారు నీల్వాయి ఎస్సైకి ఫోన్‌‌ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు మూడు గంటల పాటు గాలించి రాజ్‌‌కుమార్‌‌ డెడ్‌‌బాడీని బయటకు తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంపటేల్‌‌ తెలిపారు.

బైక్‌‌ అదుపుతప్పి...

జమ్మికుంట, వెలుగు : బైక్‌‌ అదుపుతప్పి ఓ స్టూడెంట్‌‌ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మ్యాదరి అనుదీప్ (15) శుక్రవారం ఫ్రెండ్స్‌‌తో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌‌పై ఇల్లందకుంటకు వెళ్లాడు. అక్కడి నుంచ చిన్న కోమటిపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌‌ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న బండరాయిని ఢీకొనడంతో అనుదీప్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌‌కుమార్‌‌ తెలిపారు. 

ఆదిలాబాద్‌‌ జిల్లాలో టెన్త్‌‌ స్టూడెంట్‌‌

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌ పట్టణంలోని కొత్త కుమ్మరివాడకు చెందిన జిల్లెడే రిషికుమార్‌‌ (16), తన ఫ్రెండ్‌‌ ప్రేమ్‌‌కుమార్‌‌తో కలిసి కచ్‌‌కంటి గ్రామంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం బైక్‌‌పై తిరిగి వస్తుండగా ఏరోడ్రం గ్రౌండ్‌‌ వద్ద బైక్‌‌ అదుపు తప్పడంతో కిందపడ్డారు. ప్రమాదంలో రిషికుమార్‌‌ అక్కడికక్కడే చనిపోగా, ప్రేమ్‌‌కుమార్‌‌కు గాయాలు కాగా రిమ్స్‌‌కు తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ సునీల్‌‌కుమార్‌‌ పరిశీలించారు. మృతుడి తండ్రి ఊశన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.