
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సైట్లో గురువారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. వరుసగా 6 వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో షెడ్డు మొత్తం ధ్వంసమైంది. ఓ కార్మికుడు గాయపడగా హాస్పిటల్కు తీసుకెళ్లారు. తీగలపల్లి గ్రామ సమీపంలో అండర్ టన్నెల్ కెనాల్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ వర్క్ సైట్లో నిర్మించిన స్టోర్ రూంలో వెల్డింగ్కోసం వాడుకునేందుకు స్టాక్ చేసిన 6 సిలిండర్లు పేలిపోయాయి. వరుసగా ఆరు పేలడంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వేరే షెడ్లు కూడా ధ్వంసమయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్లు తెప్పించారు. ప్రమాదం జరిగిన టైంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదం విషయాన్నీ బయటకు రాకుండా చేయడానికి సిబ్బంది ప్రయత్నించారు. వీడియోలు, ఫొటోలు తీసుకున్న మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు అంటుండగా చికిత్స పొందుతున్న కార్మికుడి వివరాలు, ఫొటో బయటకు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.