విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఇవాళ (సెప్టెంబర్ 24) హీట్ మెటల్ మీద పడి మల్లేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది, అధికారులు హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ప్లాంట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. వీడియో ప్రకారం.. హీట్ మెటల్ కింద పడటంతో మంటలు చెలరేగాయి.
ALSO READ | ఏం జరిగింది : తిరుపతిలో దిగకుండానే.. తిరిగి హైదరాబాద్ వచ్చిన విమానం
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు ఎస్ఎమ్ఎస్ -1 విభాగం నుండి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనికి కారణం నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారనే అంశం. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని గత కొన్ని రోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.