లే నాన్న ఇంటికి వెళ్దాం.. బొగ్గు లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి

లే నాన్న ఇంటికి వెళ్దాం..  బొగ్గు లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి
  • చనిపోయిన తండ్రిని పిలిచిన చిన్నారులు  
  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల ధర్నా  
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల సమీపంలో ఘటన

మల్హర్, వెలుగు: బొగ్గు లారీ ఢీ కొని సెక్యూరిటీ గార్డు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ గార్డు గొడిసెల శ్రీకాంత్(30) మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్ పై చిన్నతూండ్లలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. తాడిచెర్ల నుంచి కొయ్యూరు వైపు వెళ్లే బొగ్గు లారీ మల్లారం వద్ద అతడిని ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా పెంచికల్ పేటకు చెందిన శ్రీకాంత్ కు భార్య సౌందర్య, 6, 4 ఏండ్లు, 9 నెలల వయసులోపు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 

తండ్రి డెడ్ బాడీని చూసి ‘ లే నాన్న ఇంటికి వెళ్దాం’ అంటూ చిన్నారులు పలికిన మాటలు స్థానికులను కన్నీరు పెట్టించాయి. శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బుధవారం డెడ్ బాడీ తో బంధువులు తాడిచెర్ల – -కొయ్యూరు మెయిన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు.  కాటారం సీఐ నాగార్జునరావు వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.