హైదరాబాద్–నాగార్జున సాగర్ హైవేపై ఘోర ప్రమాదం

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. మృతుల్లో ముగ్గురిది ఒకే ఫ్యామిలీ
  • నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘటన

కొండమల్లేపల్లి (చింతపల్లి)/యాదాద్రి, వెలుగు : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి ఏరియాలోని హైదరాబాద్–నాగార్జున సాగర్ హైవేపై  బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మూల మలుపు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. పీఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్(38), భార్య రమణ(35), కొడుకులు అవినాశ్(12), రవి(10)లతో కలిసి హైదరాబాద్​ లో  ఉంటున్నాడు. ప్రసాద్ కారు డ్రైవర్ కాగా..అతని భార్య కూలీ పనిచేస్తుంది. రేషన్ కేవైసీ కోసం ప్రసాద్.. బుధవారం తన భార్యను, కొడుకు అవినాశ్ ను తీసుకుని బైకుపై అక్కంపల్లికి బయలుదేరాడు. నసర్లపల్లి స్టేజీ వద్దనున్న కేవీపీఎస్ మిల్లు వద్దకు రాగానే కొండమల్లే పల్లి నుంచి వీటి నగర్ వైపు వెళుతున్న ఓ కారు బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీకొట్టింది. బైకుపైనున్న ప్రసాద్, అవినాశ్ అక్కడికక్కడే  మృతి చెందారు. గాయపడిన రమణను పట్నం మణిపాల్(18), వనం మల్లికార్జున్(18), పులి పవన్, వారాల మణిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ట్రీట్మెంట్ పొందుతూ..రమణ, మణిపాల్, మల్లికార్జున్ మృతి చెందారని, పవన్, మణి ఇద్దరికి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతున్నదని వివరించారు. చనిపోయిన యువకులిద్దరూ  చింతపల్లి మండలం కురంపల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.  

గ్రామాల్లో విషాదఛాయలు

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, రమణ, అవినాశ్.. యువకులు మణిపాల్, మల్లికార్జున్ చనిపోవడంతో వారి సొంతూర్లు అక్కంపల్లి, కురంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ప్రస్తుతం దేవరకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో  డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.

యాదాద్రిలో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం ఏరియాలో  జరిగింది. మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్ డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు (ఏపీ 36 జడ్ 0197) బుధవారం 33 మంది ప్యాసింజర్లతో  జగద్గిరిగుట్టకు బయలుదేరింది. బొడ్డుగూడెం గ్రామం దాటగానే అదుపు తప్పి నీటి గుంతలో  బోల్తా పడింది.  అడ్డగూడూరు మండలం కోటమర్తి పంచాయతీ కార్యదర్శి కొండ రాములు (58), చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ (50) అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. పోలీసులు స్పాట్​కు చేరుకుని బాధితులను  ఆస్పత్రులకు తరలించారు.  బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే  బస్సు బోల్తా పడిందని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఘటనాస్థలంలోనే  బైఠాయించి ఆందోళన చేపట్టారు