కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2024, నవంబర్ 9 శనివారం నల్పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో షాలిమార్ ఎక్స్ ప్రెస్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన రైలు.. సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే ఆధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ ప్రయాణికులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. రైల్వే వర్గాల ప్రకారం.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఒకరిద్దరూ ప్రయాణీకులకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. ఘటన స్థలంలో రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తొలగించారు.
యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. షాలిమార్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.