ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి
కర్నూలు: దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి కారు పల్టీకొట్టి బోల్తాపడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. వైసీపీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్‌డే వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో అన్ని చోట్లా వేడుకలు జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి బర్త్ డే కలిసి వచ్చింది.
జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత 2019 ఎన్నికలకు వైసీపీ తరపున పోటీ చేయబోయే మొదటి అభ్యర్థి శ్రీదేవి అని ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీదేవిని తొలి అభ్యర్థిగా ప్రకటించిన వేళా విశేషం.. జగన్ భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలచి సీఎం కావడంతో పాదయాత్ర వేడుకలను ఎమ్మెల్యే శ్రీదేవి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడైన ప్రదీప్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలను దీటుగా తెలియజేస్తుడడంతో చాలా దూరమనైనప్పటికీ సొంత మండలమైన వెల్దుర్తికి చెందిన పలువురు పత్తికొండకు వెళ్లి ఎమ్మెల్యే శ్రీదేవి ని కలసి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్వించుకున్నారు. తిరిగి సొంతూరు వెల్దుర్తికి బయలుదేరి వస్తుండగా కరిడికొండ దగ్గర ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి బోల్తాపడిన కారులో మొత్తం పది మంది వరకు ఉన్నట్లు సమాచారం. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా పల్టీకొట్టడంతో కారులో ఉన్న వారు ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవి.. వైసీపీ నాయకుడు చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.