- పోలీసుల అదుపులో నిందితులు
కుభీర్, వెలుగు : ఆలయంలో చోరీకి యత్నించిన నిందితులు పారిపోతూ చెట్టుకు ఢీకొన్నారు. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కుభీర్మండలంలో పార్డి (బి) గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పగులగొట్టేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో వచ్చిన కారులో ఎక్కించేందుకు యత్నిస్తుండగా.. చప్పుడు విన్న ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం అందించారు.
వెంటనే వారు ఆలయం వద్దకు రావడంతో దొంగలు కారులో పరారయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భైంసా వైపునకు పారిపోయారని చెప్పడంతో కుభీర్, భైంసా రూరల్పోలీసులు రంగంలోకి దిగారు. వారికోసం పోలీసులతోటు స్థానికులు సైతం గాలిస్తుండగా.. భైంసా మండలం మహగాం సమీపంలో ఓ కారు పంక్చర్ అయ్యి చెట్టుకు ఢీకొని ఉండడంతో అక్కడికి వెళ్లి చూశారు.
అందులో ఓ వ్యక్తి, మరో మహిళ ఉండడంతో వారిని చూసిన స్థానికులు చోరీకి వచ్చింది వీరేనని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలోని సీసీ పుటేజీని పరిశీలించి దొంగలు వారేనని నిర్ధారించారు. వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.